పాకిస్తాన్​పై పరోక్షంగా ప్రధాని మండిపాటు

పాకిస్తాన్​పై పరోక్షంగా ప్రధాని మండిపాటు
  • టెర్రరిజానికి సపోర్ట్ చేసే దేశాలను నిలదీయాలె
  • ఎస్​సీవో సభ్య దేశాలకు మోదీ పిలుపు
  • పాకిస్తాన్​పై పరోక్షంగా ప్రధాని మండిపాటు

న్యూఢిల్లీ:  టెర్రరిజంపై పోరాటంలో వెనకడుగు వేయొద్దని, ఏ దేశమూ డబుల్ స్టాండర్డ్స్ చూపొద్దని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సభ్యదేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు సపోర్ట్ చేయడమే తమ పాలసీగా పెట్టుకున్న దేశాలను నిలదీయడంలో ఎలాంటి సంకోచం చూపరాదంటూ పరోక్షంగా పాకిస్తాన్ తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. మంగళవారం తన అధ్యక్షతన వర్చువల్ గా జరిగిన ఎస్ సీవో దేశాధినేతల 23వ సమిట్ లో ప్రధాని మాట్లాడారు. ప్రాంతీయ,  ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన టెర్రర్ సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకోవడం, టెర్రరిజాన్ని అంతం చేయడంలో ఎస్ సీవో దేశాలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉబ్జెకిస్తాన్, ఇరాన్ దేశాల అధినేతలు పాల్గొన్న ఈ సమావేశంలో టెర్రరిజం, ఇతర అంతర్జాతీయ సవాళ్లపై మోదీ మాట్లాడారు. దేశాల మధ్య వివాదాలను శాంతియుతంగా, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని పరోక్షంగా చైనాకు కూడా హితవుపలికారు. అఫ్గానిస్తాన్​లో నెలకొన్న సంక్షోభంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని అనేక వివాదాలు, ఉద్రిక్తతలు, వ్యాధులు వంటి సవాళ్లు చుట్టుముట్టిన ప్రస్తుత తరుణంలో అన్ని దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాలతో సతమతం అవుతున్నాయని అన్నారు. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ప్రయత్నాలు 
చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కొత్త మెంబర్​గా ఇరాన్.. 

ఎస్ సీవోలో సంస్కరణలు, విస్తరణకు ఇండియా మద్దతును ఇస్తోందని మోదీ ప్రకటించారు. ఈ గ్రూప్ లో కొత్త (9వ) మెంబర్ గా చేరిన ఇరాన్​కు అభినందనలు తెలియజేశారు. అలాగే ఎస్ సీవో మెంబర్షిప్ కోసం సంతకం చేసిన బెలారస్ ను స్వాగతించారు. కాగా, చైనాలోని షాంఘైలో 2001లో జరిగిన సమిట్ సందర్భంగా రష్యా, చైనా, కిర్గిజిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల అధ్యక్షులు ఎస్ సీవో గ్రూపును స్థాపించారు. ఇందులో ఇండియా 2005 నుంచి అబ్జర్వర్ కంట్రీగా చేరింది. 2017లో కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన సమిట్​లో ఫుల్ మెంబర్​గా మారింది. పాకిస్తాన్ కూడా అదే సమిట్​లో ఫుల్ మెంబర్షిప్ పొందింది.  

టెర్రరిజంపై గట్టిగా పోరాడాలె: షెహబాజ్ షరీఫ్ 

టెర్రరిజం అనేది ‘అనేక తలలతో కూడిన రాకాసి పాము’లాంటిదని, దానిపై పూర్తి శక్తితో పోరాటం చేయాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. మంగళవారం ఎస్ సీవో దేశాల వర్చువల్ సమిట్ లో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా, గ్రూపులు లేదా దేశాల స్థాయిలో టెర్రరిజాన్ని అంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. అయితే, ఇతర దేశాలపై దౌత్యపరంగా పైచేయి సాధించేందుకు టెర్రరిజం అంశాన్ని వాడుకోరాదన్నారు. సొంత దేశంలో రాజకీయ ఎజెండా కోసం మతపరమైన మైనార్టీలపై దుష్ప్రచారాన్ని కూడా ఆపేయాలన్నారు. కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలన్నారు.