నేవీ అమ్ములపొదిలోకి మరో యుద్ధ విమాన వాహక నౌక

నేవీ అమ్ములపొదిలోకి మరో యుద్ధ విమాన వాహక నౌక

కొచ్చి: నేవీ అమ్ములపొదిలోకి మరో యుద్ధ విమాన వాహక నౌక చేరింది. మేకిన్​  ఇండియాలో భాగంగా, ఫస్ట్​ టైమ్​ మనదేశంలోనే డిజైన్ చేసి, నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వద్ద జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ ను నేవీలోకి ప్రవేశపెట్టడానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను నిర్మించుకోగలిగిన అతికొద్ది దేశాల సరసన ఇండియా నిలిచింది. ఈ రోజు ఐఎన్ఎస్ విక్రాంత్ దేశానికి కొత్త కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇది ఇండియన్ స్కిల్స్, ట్యాలెంట్ కు రుజువు.” అని అన్నారు. కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, నేవీ చీఫ్​ అడ్మిరల్ ఆర్.హరికుమార్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్‌‌‌‌, నేవీ ఆఫీసర్లు పాల్గొన్నారు.  

నేవీకి కంగ్రాట్స్: రాహుల్ గాంధీ 
ఐఎన్ఎస్ విక్రాంత్ నేవీలోకి చేరడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. నేవీతో పాటు నౌకను డిజైన్ చేసిన నేవల్ డిజైన్ బ్యూరో, నిర్మించిన కొచ్చిన్ షిప్ యార్డ్ ను ఆయన అభినందించారు. స్వదేశీయంగా ఈ నౌకను నిర్మించడం వెనక ఎన్నో ఏండ్ల శ్రమ దాగి ఉందని, నౌక నేవీ చేతికి అందడంతో మన దేశ సముద్ర భద్రత గణనీయంగా పెరిగిందని 
ఆయన ట్వీట్ చేశారు. 

ఐఎన్ఎస్ విక్రాంత్ సమష్టి కృషి: జైరాం రమేశ్ 
తొలి స్వదేశీ యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం వెనక గత ప్రభుత్వాల కృషి కూడా ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. 1999 నుంచే ఈ నౌక నిర్మాణం మొదలైందని, కానీ ప్రధాని మోడీ తన ప్రభుత్వానిదే ఈ ఘనత అన్నట్లుగా క్రెడిట్ తీసుకుంటూ, గత ప్రభుత్వాల కృషిని విస్మరించారని ఆయన విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లోనే అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రారంభించారంటూ ఆయన ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు ప్రధాని మోడీ కేవలం ఆ నౌకను కమిషనింగ్ (అధికారికంగా విధుల్లో చేరడం) మాత్రమే చేశారని పేర్కొన్నారు.

బానిసత్వ గుర్తులు చెరిపేస్తూ కొత్త జెండా.. 
ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా నేవీ కొత్త జెండాను కూడా ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ‘‘నేవీ జెండాలో ఇప్పటివరకూ బానిసత్వానికి గుర్తుగా ఉన్న చిహ్నాలను ఉపయోగిస్తూ వచ్చాం. కానీ ఈ రోజు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రూపొందించిన కొత్త జెండాను ఆవిష్కరించడం ద్వారా బానిసత్వపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించుకున్నాం” అని ప్రధాని అన్నారు. కాగా, నేవీ కొత్త జెండాలో ఎడమ వైపున జాతీయ జెండా, కుడివైపున కొంచెం దిగువన నేవీ గుర్తును రూపొందించారు. నేవీ గుర్తు మధ్యలో యాంకర్, దాని చుట్టూ నీలం రంగు, ఆ తర్వాత రెండు ఆక్టోగోన‌‌‌‌ల్ (అష్టభుజి) ఆకారంలోని బంగారు రంగు బార్డర్లను గీశారు. ఈ ఆక్టోగోనల్ బార్డర్లను ఛ‌‌‌‌త్రప‌‌‌‌తి శివాజీ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఎనిమిది దిక్కుల్లోనూ తన నావికాదళాన్ని పటిష్టం చేసిన శివాజీ.. నేవీ జెండాలో ఈ బార్డర్లను ఉపయోగించారు. అలాగే యాంకర్ కింద ‘సం నో వరుణా’ అని రాశారు. ఓ వరుణ దేవుడా సముద్రంలో మాకు విజయం కలిగేలా చూడు అని దీనర్థం. కాగా, జనవరి 26, 1950న ఇండియా రిపబ్లిక్‌‌‌‌గా అవతరించడంతో ఇండియన్ నేవీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేవీ జెండాను మార్చడం ఇది నాలుగోసారి. 

రెండో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్.. 
ఇప్పటివరకు మన నేవీ వద్ద ఉన్న యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒక్కటే. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ తోడవడంతో సముద్రంలో మన నేవీ బలం భారీ గా పెరిగింది. అలాగే ఐఎన్ఎస్ విక్రాంత్ తో స్వదేశీయంగా భారీ యుద్ధ విమాన వాహక నౌకలను నిర్మించే సత్తా సొంతం చేసుకున్న ఆరో దేశంగా ఇండియా రికార్డ్ సృష్టించింది. ఇప్పటిదాకా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్​లకు 40 వేల టన్నులకుపైగా బరువున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను నిర్మించుకునే కెపాసిటీ ఉంది.