న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో మూడు వారాలకు పైగా కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని, దాని దుష్ప్రభావాల నుంచి భారత్ కూడా తప్పించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రకటన చేస్తూ, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను షేక్ చేస్తున్నదని, ప్రపంచం ఈ నష్టం నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.
ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని, ఆర్థిక రంగం నుంచి అంతర్గత భద్రత వరకూ అన్ని రంగాల్లో సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చమురు, గ్యాస్, ఎరువుల సరఫరాపై యుద్ధం ప్రభావం పడిందని, వాణిజ్య మార్గాలు దెబ్బతిన్నాయని వివరించారు. అయినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయని, ప్రభుత్వం స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహంతో పరిస్థితిని నిర్వహిస్తోందని ఆయన హామీ ఇచ్చారు.
నౌకా మార్గాలకు అడ్డంకులు సరికాదు
ఇంధన భద్రత విషయంపై మోదీ మాట్లాడుతూ.. గత పదకొండేళ్లలో భారత్ తన ఇంధన దిగుమతులు 27 దేశాల నుంచి 41 దేశాలకు విస్తరించిందని, వ్యూహాత్మక చమురు నిల్వలు 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నాయని, 65 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే పనులు జరుగుతున్నట్టు వివరించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎల్పీజీ సరఫరాలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ, దాన్ని అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కరోనా మహమ్మారి సమయంలో ఏర్పాటు చేసిన సాధికారత బృందాల తరహాలో ఇప్పుడు ఏడు సాధికారత బృందాలను ఏర్పాటు చేశామని, అవి సరఫరా, -డిమాండ్ సమస్యలు, ధరల హెచ్చుతగ్గులు, వాణిజ్యం, ఎగుమతులు వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఇంధన దిగుమతులు నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకున్నామని, దేశీయ ఉత్పత్తి పెంచడంపై, ఇథనాల్ బ్లెండింగ్‌పై దృష్టి పెట్టామన్నారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు, రవాణాకు అడ్డంకులు ఆమోదయోగ్యం కాదని మోదీ స్పష్టంగా చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో కోటి మంది భారతీయులు
గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3.75 లక్షల మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగివచ్చారని మోదీ తెలిపారు. ఇరాన్ నుంచి దాదాపు వెయ్యి మంది భారతీయులను, వారిలో 700కు పైగా మెడికల్ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చామని వివరించారు. పశ్చిమాసియా దేశాల అధినేతలతో రెండు విడతల్లో స్వయంగా మాట్లాడామని, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా నాయకులతోనూ చర్చలు జరిపామని మోదీ చెప్పారు.
