12న ఆర్ఎఫ్​సీఎల్​ను జాతికి అంకితం చేయనున్న పీఎం

 12న ఆర్ఎఫ్​సీఎల్​ను జాతికి అంకితం చేయనున్న పీఎం
  • ఆర్ఎఫ్ సీ వాల్ రైల్వే, నేషనల్ హైవే సంస్థల భాగస్వామ్యం
  • నేడు పర్యవేక్షించనున్న కేంద్రమంత్రి భగవంత్ 

గోదావరి ఖని, వెలుగు : ఈ నెల 12న రామగుండం ఫెర్టిలైజర్స్‌‌ అండ్‌‌ కెమికల్స్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌) ప్లాంట్‌‌ను జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండం వస్తున్న సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. 12న ప్లాంట్‌‌ ప్రారంభంతో పాటు కేంద్ర రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం (భద్రాచలం రోడ్‌‌) నుంచి సత్తుపల్లి వరకు 60 కిలోమీటర్లు నిర్మించిన రైల్వే లైన్‌‌ను, నేషనల్‌‌ హైవేస్‌‌ ఆథారిటీ ఆధ్వర్యంలో 133 కిలోమీటర్ల మెదక్‌‌ ‒సిద్దిపేట‒ఎల్కతుర్తి రోడ్డు, 17 కిలోమీటర్ల సిరివంచ‒మహాదేవపూర్‌‌ రోడ్డు, 56 కిలోమీటర్ల బోధన్‌‌ ‒ బాసర రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ తో పాటు రైల్వే, నేషనల్‌‌ హైవే ​అథారిటీ సంస్థల ఆఫీసర్లు కలిసి ప్రధాని పాల్గొననున్న కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రూ. 5 కోట్ల ఖర్చుతో..

దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌‌కుమార్‌‌ జైన్‌‌, డివిజన్ రీజినల్ మేనేజర్ అలోక్‌‌ కుమార్‌‌ గుప్తా, మినిస్ట్రీ ఆఫ్‌‌ రోడ్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ అండ్‌‌ హైవేస్‌‌ రీజినల్‌‌ ఆఫీసర్‌‌ ఎస్‌‌కె కుశ్వార్‌‌, ఈఈ సుభోద్‌‌ మంగళవారం ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌ ఆఫీస్‌‌లో సంస్థ సీఈఓ అలోక్ సింఘాల్‌‌, ఇతర ఆఫీసర్లతో సమీక్ష చేశారు. సుమారు రూ.5 కోట్ల ఖర్చుతో ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. హర్యానాలోని గుర్‌‌గావ్‌‌కు చెందిన కాంట్రాక్టర్‌‌ ఆధ్వర్యంలో సభా వేదికతో పాటు ప్రజలు కూర్చునేందుకు వీలుగా పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్‌‌ సెక్యూరిటీ గార్డ్స్​బుధవారం నుంచి ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌తో పాటు బహిరంగ సభ జరిగే ఎన్టీపీసీలోని స్టేడియాన్ని ఆధీనంలోకి తీసుకోనున్నాయి. 

పెద్దసంఖ్యలో రైతులు తరలివచ్చేలా..

రామగుండం ఎరువుల ప్లాంట్‌‌ను కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్‌‌ ఖుబా బుధవారం సందర్శించి ఆఫీసర్లతో సమీక్ష చేయనున్నారు. ఎరువుల ప్లాంట్‌‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న సభలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. బీజేపీ స్టేట్ ఛీప్‌‌ బండి సంజయ్‌‌, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌ వెంకటస్వామి, ఇతర లీడర్లు బుధవారం కేంద్ర మంత్రి భగవంత్‌‌తో కలిసి పార్టీ లీడర్లు, కార్యకర్తలతో సమావేశమై సభ విజయవంతం కోసం దిశానిర్దేశం చేయనున్నారు. 

ఇదీ షెడ్యూల్​ 

12న మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాని మోడీ ఎన్‌‌టీపీసీ హెలీప్యాడ్‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌కు వెళ్లి కంట్రోల్‌‌ రూమ్‌‌లో యూరియా ఉత్పత్తి ప్రక్రియను పరిశీలిస్తారు. తర్వాత రోడ్డు మార్గం ద్వారా ఎన్టీపీసీ స్టేడియానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఎన్టీపీసీ నుంచి ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌ వరకు రోడ్డు మార్గం క్లియర్‌‌గా ఉండేలా రామగుండం కార్పొరేషన్‌‌ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని రామగుండం పర్యటన నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్​వర్గాలు నిఘా పెంచాయి. స్థానిక పోలీసులతో కలిసి ప్రధాని రూట్‌‌ మ్యాప్‌‌ను ఆఫీసర్లు మంగళవారం పరిశీలించారు.