ఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ 

ఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ 

ఎన్నారై కాలేజీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ నెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్లో నిర్వహించిన సోదాల్లో సదరు కాలేజీకి 53 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు ఆస్తులు సీజ్ చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. ఎన్నారై సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేయడంతో పాటు కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. కోవిడ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎన్నారై సొసైటీ ఖాతాల్లో చూపించలేదన్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పింది. 

అడ్మిషన్ ఫీజుల పేరుతో ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లు చెప్పింది. ఎన్నారై సొసైటీ ఖాతా నుంచి ఎన్ఆర్ఐఏఎస్ ఖాతాకు బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.