వందేండ్ల ప్రాజెక్టు నిలబడ్డది.. రెట్టింపు వరద వచ్చినా చెక్కుచెదరని పోచారం

వందేండ్ల ప్రాజెక్టు నిలబడ్డది.. రెట్టింపు వరద వచ్చినా చెక్కుచెదరని పోచారం
  • సైడ్ వాల్ వద్ద ఏర్పడిన గుంతను పూడ్చిన అధికారులు
  • 70 వేల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిజాం కాలంలో డిజైన్
  • 1.82 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఆపిన ప్రాజెక్టు
  • గేట్లు లేకుండానే నిర్మాణం.. తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే.. 

 హైదరాబాద్/లింగంపేట, వెలుగు: లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులు పట్టుమని మూడేండ్లు కూడా ఉంటలేవ్.. డిజైన్ చేసిన వరదనే తట్టుకుంటలేవ్.. వరద తాకిడికి పిల్లర్లే కుంగిపోతున్నయ్.. కానీ వందేండ్ల చరిత్ర ఉన్న ఒక్క ప్రాజెక్టు మాత్రం నిటారుగా నిలబడ్డది. డిజైన్​చేసిన వరదకు రెండింతలు వచ్చినా చెక్కు చెదరలేదు. అదే తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన తొలి ప్రాజెక్టు​పోచారం. దీన్ని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారంలో నిజాం కాలంలో నిర్మించారు.

భారీ వర్షాలతో బుధవారం ఈ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లింగంపేట పెద్దవాగు, తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు ద్వారా పెద్ద ఎత్తున వరద వచ్చింది. ప్రాజెక్ట్​స్పిల్ వేతో పాటు పైనుంచి కూడా వరద ఉప్పొంగింది. ప్రాజెక్టు పైనుంచి మూడు నాలుగు అడుగుల ఎత్తులో వరద ప్రవహించడంతో సైడ్​వాల్​పొంటి పెద్ద గుంత పడింది. 

దీంతో ప్రాజెక్ట్​కొట్టుకుపోతుందేమోనని ప్రజలు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ప్రాజెక్టు కింద ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ పోచారం ప్రాజెక్టు అంత వరదనూ తట్టుకుని నిలబడింది. దాన్ని గురువారం ఏరియల్ సర్వే ద్వారా సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పరిశీలించారు. కాగా, ప్రాజెక్టు సైడ్​వాల్​వద్ద ఏర్పడిన గుంతను గురువారం జేసీబీల సహాయంతో అధికారులు పూడ్చివేశారు. 

2 టీఎంసీల కెపాసిటీ.. 

మంజీరా నదికి ఉపనది అయిన ఆలేరు/మంచిప్ప వాగుపై పోచారం ప్రాజెక్టును నిర్మించారు. దీనికి 1917లో నిజాం రాజు శంకుస్థాపన చేయగా, 1922 నాటికి పనులు పూర్తి చేశారు. గేట్లు లేకుండా ఓపెన్‌‌గా ఈ ప్రాజెక్టును నిర్మించడం మరో విశేషం. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 72 వేల గరిష్ట వరద సామర్థ్యంతోనే నిర్మించారు. ఇప్పటి వరకు దానికి మించి ఎప్పుడూ ఆ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చింది లేదు. కానీ బుధవారం ఈ ప్రాజెక్టుకు 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంటే రెండింతలకు మించి వరద వచ్చింది. అయినప్పటికీ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు.

దీన్ని బట్టి 103 ఏండ్ల కింద నిర్మించిన ఈ ప్రాజెక్టును ఎంత పటిష్ఠంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో రూ.27.11 లక్షల ఖర్చుతో 1.7 కిలోమీటర్ల పొడవు, 21 అడుగుల ఎత్తుతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని​సామర్థ్యం 2.423 టీఎంసీలు కాగా.. వరదలతో వచ్చే పూడిక వల్ల ఆ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గింది. ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, మెదక్​జిల్లాల్లోని 10,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ప్రాజెక్టు కింద ఏ, బీ జోన్లుగా 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఏ జోన్‌‌లో 48, బీ జోన్‌‌లో 49 నుంచి 73వ నంబర్​డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. 

టూరిస్ట్​ స్పాట్.. 

పోచారం ప్రాజెక్టు టూరిస్ట్​స్పాట్‌‌గానూ ప్రాచుర్యం పొందింది. రిజర్వాయర్​కట్ట పక్కన నిజాం కోట ఉన్నది. ఈ ప్రాజెక్టులో బోటు షికారు చేసేందుకు వసతులు ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగానూ పోచారం ప్రాజెక్టుకు పేరుంది. దీన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారని అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లే ఎక్కువగా వస్తుంటారని, దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.