పీవోకే మన అంతర్భాగమే : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

పీవోకే మన అంతర్భాగమే : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  •  2026 కల్లా టెర్రరిస్ట్ రహిత జమ్మూ కాశ్మీర్ చూస్తాం
  • సవరణ బిల్లులతో కాశ్మీరీ పండిట్లకు న్యాయం
  • పీవోకే ఏర్పడటానికి కారణం నెహ్రూయే అని ఫైర్

న్యూఢిల్లీ: పీవోకే ఇండియాలో అంతర్భాగమని, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీవోకే కోసం 24 అసెంబ్లీ స్థానాలు కూడా కేటాయించామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. గతంలో జమ్మూలో 37 సీట్లు ఉండగా, ఇప్పుడు 43 ఉన్నాయని స్పష్టం చేశారు. కాశ్మీర్‌‌లో గతంలో 46 సీట్లు ఉండగా.. ప్రస్తుతం 47 స్థానాలు ఉన్నాయని తెలిపారు. పీవోకేకు 24 సీట్లు రిజర్వ్ చేశామని చెప్పారు. 2026 కల్లా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో టెర్రరిస్ట్​లు లేని జమ్మూ కాశ్మీర్​ను చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు- 2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-–2023పై లోక్​సభలో జరిగిన చర్చలో అమిత్ షా పాల్గొన్నారు. లోక్​సభలో ఈ రెండు బిల్లులు బుధవారం పాస్ అయ్యాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. ‘‘జమ్మూ కాశ్మీర్​లో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయడానికే ఈ బిల్లులు తీసుకొచ్చాం. 70 ఏండ్లుగా అణిచివేతకు గురైన వాళ్లకు ఈ బిల్లు స్వేచ్ఛ ఇస్తుంది. ఇండ్లు వదిలి దేశంలోని వివిధ ప్రాంతాల్లో శరణార్థులుగా బతుకుతున్న కాశ్మీరీ పండిట్లకు ఈ బిల్లు న్యాయం చేస్తుంది. కాశ్మీరీ మైగ్రెంట్లు, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ బాధితులు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్లకు ఇక్కడి అసెంబ్లీలో ప్రాతినిథ్యం కల్పించే హక్కు కల్పిస్తుంది” అని అమిత్ షా ప్రకటించారు.

టెర్రరిజం అంతం చేస్తాం

జమ్మూ కాశ్మీర్​లో టెర్రరిజం కారణంగా 45వేల మంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా అన్నారు. ‘‘మా ఫోకస్ అంతా టెర్రరిజం అంతం చేయడంపైనే ఉంది. 2024లో మళ్లీ  మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. 2026 కల్లా టెర్రరిస్ట్​లు లేని జమ్మూ కాశ్మీర్​ను చూస్తాం. కాశ్మీరీ పండిట్లు తమ దేశంలోనే మైగ్రెంట్లుగా బతకాల్సి వచ్చింది. 46,631 కుటుంబాలు (1,57,968 మంది) తమ ఇండ్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బిల్లులు వారందరికీ హక్కులు కల్పిస్తాయి”అని అమిత్ షా అన్నారు. ‘‘మాజీ ప్రధాని నెహ్రూ రెండు పెద్ద తప్పులు చేశారు. మొదటిది..  కాల్పుల విరమణ చేయడం. రెండోది.. మన దేశంలో అంతర్భాగమైన పీవోకే అంశాన్ని యునైటెడ్ నేషన్స్ వద్దకు తీసుకెళ్లడం. అప్పట్లో కాల్పుల విరమణ మరో మూడు రోజులు చేయకుండా ఉంటే.. పీవోకే ఇప్పుడు జమ్ముకాశ్మీర్‌‌లో భాగంగా ఉండేది”అని అమిత్ షా అన్నారు. జమ్మూ కాశ్మీర్ బిల్లులపై రెండు రోజుల పాటు ఆరు గంటలకు పైగా చర్చించారు. సభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు.

రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన లేదు: కేంద్రం

అక్టోబర్ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్‌‌లుగా ప్రభుత్వం గుర్తించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అర్హత ఉన్న కంపెనీలకు 2016, జనవరిలో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా యాక్షన్ కింద ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు అందించామన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ యాక్షన్ ప్లాన్ కింద మూడేండ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఇతర వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంచే ప్రతిపాదన ఏమీలేదని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. క్వశ్చన్ అవర్​లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీ ప్రకారం.. ఓబీసీలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్ కల్పించామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఓ సభ్యుడు కోరగా.. అలాంటి ప్రతిపాదనేమీ తమ ముందు లేదంటూ స్పష్టం చేశారు.

గోమూత్ర రాష్ట్రాల కామెంట్లపై సభలో రచ్చ రచ్చ

హిందీ మాట్లాడే స్టేట్స్ అన్నీ గో మూత్ర రాష్ట్రాలంటూ.. నార్త్, సౌత్ అంటూ డివైడ్ చేసి మాట్లాడిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్​పై బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ఉభయ సభల్లో సెంథిల్ కుమార్ కామెంట్లపై నిరసన వ్యక్తం చేశారు. డీఎంకే లీడర్ టీఆర్ బాలు, కాంగ్రెస్ లీడర్ రాహుల్​ను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నిలదీశారు. వెంటనే సెంథిల్ కుమార్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ లీడర్ల నిరసనతో సభలో వాయిదాల పర్వం కొనసాగింది. తర్వాత టీఆర్ బాలు మాట్లాడుతూ.. ‘‘సెంథిల్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం. ఎంకే స్టాలిన్ కూడా హెచ్చరిం చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు” అని అన్నారు.

నన్ను క్షమించండి: సెంథిల్ కుమార్

పార్లమెంట్‌‌లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ సెంథిల్‌‌ కుమార్ ఉపసంహరించుకున్నారు. ‘మంగళవారం సభలో నా వ్యాఖ్య లు సరికాదు. ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. పార్లమెంటు రికార్డుల నుంచి ఆ కామెంట్లు తొలగించాలని కోరుతున్నా’’ అని సెంథిల్‌‌ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సోషల్ మీడియాలోనూ.. లోక్​సభలో తన కామెంట్ల పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్‌‌ చేశారు.