
ఆసిఫాబాద్, వెలుగు: ప్రేమ, పెండ్లి పేరిట బాలికను నమ్మించి మోసగించిన నిందితుడికి పోక్సో కేసులో 10 ఏండ్ల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు బుధవారం ఇచ్చారు. సీఐ బుద్దె స్వామి తెలిపిన ప్రకారం.. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన చునార్కర్ మహేందర్ కు పెండ్లి అయింది. కాగా.. 2019లో అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని, వెంటపడుతూ వేధిస్తుండగా వద్దంటూ బాలిక వేడుకున్నా వినలేదు. ఆపై అతడు మాయమాటలు చెప్పి బాలికను లోబర్చుకున్నాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో రెబ్బెన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి చార్జ్ షీట్ కోర్టుకు సమర్పించారు. వాదోపవాదాల అనంతరం సాక్షులను విచారించి నేరం రుజువుకావడంతో నిందితుడు మహేందర్ కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.