రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య..వివాహేతర సంబంధాలే కారణమా?

రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య..వివాహేతర సంబంధాలే కారణమా?

మెదక్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకార్ శ్రీనివాస్ హత్యపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మృతునికి గొడవలు ఉండటంతో పాటు, పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మృతుడి భార్య హైందవి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ మర్డర్ పై IPC 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ కాల్ డాటా, సీసీ కెమెరాల పుటేజీ, సీడీఆర్ అనాలసిస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే  నిందితులను పట్టుకుంటామన్నారు పోలీసులు. 

రెండు రోజుల కిందట ధర్మకార్ శ్రీనివాస్ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావ్ పేట శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని డిక్కీలో వేసి కారును తగులబెట్టారు దుండగులు. పొలాల్లో ఓ కారు మంటల్లో కాలిపోతుండగా గ్రామానికి చెందిన ఓ యువకుడు సెల్ ఫోన్లో వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. స్థానికుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్నవెల్దుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీ పూర్తిగా కాలి బూడిదై గుర్తు పట్టలేని విధంగా ఉంది. నెంబర్ ప్లేట్ కూడా కాలిపోగా పోలీసులు ఇంజిన్ చాసెస్ నెంబర్ ఆధారంగా ఆ కారును మెదక్ కు చెందిన సినిమా థియేటర్ ఓనర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకార్ శ్రీనివాస్ అలియాస్ కటికె శ్రీనుకు చెందినదిగా గుర్తించారు.
....
తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, సీఐ స్వామిగౌడ్ వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మెదక్ పట్టణ సీఐ వెంకట్ మృతుని కుటుంబ సభ్యులను విచారించారు. శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్న సీసీ పుటేజీని పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైద్రాబాద్ వెళ్తున్నానని చెప్పి శ్రీనివాస్ ఇంటినుంచి బయల్దేరన్నారు కుటుంబసభ్యులు. మంగళవారం తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పారు. అయితే సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని తెలిపారు. రాత్రికి ఇంటికి తిరిగి రాలేదన్నారు.  దీంతో యశ్వంతరావ్ పేట దగ్గర హత్యకు గురైంది శ్రీనివాసేనని అనుమానించారు. మరోవైపు శ్రీనివాస్ భార్య హైందవి, కూతుళ్లను, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు మెదక్ నుంచి సంఘటన స్థలానికి రప్పించారు. డెడ్ బాడీ గుర్తు పట్టలేని విధంగా ఉన్నా.. నోటిలో పళ్లు అలాగే ఉన్నాయి. వాటిలో రెండు కృత్రిమ పళ్లు ఉండటాన్నిగుర్తించిన భార్య హైందవి... డెడ్ బాడీ తన భర్త శ్రీనివాస్ దేనని కన్ఫాం చేశారు. తన భర్త శ్రీనివాస్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరితో గొడవలు ఉన్నాయని, అలాగే ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉండేదని చెప్పారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వెల్దుర్తి మండలానికి చెందిన ఓ మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.