మిర్యాలగూడ: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో కాపర్ చోరీ చేసి పాత ఇనుము వ్యాపారులకు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలు వెల్లడించారు. నిందితులు దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి పవర్ ప్లాంట్‌లోని బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన అన్లోడ్ చేసినటువంటి స్టోర్ యాడ్ కాపర్ వస్తువులను దొంగిలించి నిర్మానుష్య ప్రాంతంలో దాచి పెట్టేవారు. ఆ తర్వాత మిర్యాలగూడలోని పాత ఇనుము షాపులో కోట్లలో అమ్మారు.
మిర్యాలగూడకు చెందిన మేకల శ్రీను, దామరచర్ల మండలం తాళ్ల వీరప్ప గూడెం గ్రామానికి చెందిన పెండెం భాస్కర్, సాత్ తండా చెందిన గుగులోతు రఘు, దుబ్బ తండాకు చెందిన కొర్ర శివ, తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన చెన్న బోయిన నాగయ్య, సాత్ తండాకు చెందిన గుగులోతు రాముడు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన బత్తుల జానకి రాములు, పగడాల బాలరాజులు ముఠా సభ్యులుగా ఏర్పడి రెండేండ్లుగా దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఇవాళ ఉదయం ఈదలగూడ సమీపంలో నిందితులను పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షల నగదు, 2 మహీంద్ర క్యాంపర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.