
తొమ్మిది నెలల పాపను హతమార్చిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయిస్తున్నట్లు..వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రకటించారు.
శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ హన్మకోండలో ఓ హోటల్ లో క్లీనర్ గా పనిచేసేవాడు. స్థానికంగా ఉన్న కుమార్ పల్లి ప్రాంతంలో నివాసముంటున్న నిందితుడు తొమ్మిది నెలల చిన్నారిపై ఆత్యాచారం చేసి అనంతరం హత్యకు పాల్పడ్డాడు. చిన్నారి హత్యపై సమాచారం అందుకున్న హన్మకొండ పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై సెక్షన్ 366,302,376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతో పాటు 5(యం) రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
కేసుపై విచారణ చేపట్టిన వరంగల్ ప్రత్యేక కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
పూర్వపరాలు పరిశీలించిన హైకోర్ట్ నిందితుడికి ఉరిశిక్షను సవరిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ వరంగల్ కమీషనరేట్ పోలీసులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రకటించారు.