ఏసీబీ ఎస్సై పేరుతో సర్వేయర్లకు టోకరా

ఏసీబీ ఎస్సై పేరుతో సర్వేయర్లకు టోకరా
  • ఓ సర్వేయర్​కు ఫోన్​ చేసి రూ.50 వేలు తీసుకురావాలని డిమాండ్​
  • డబ్బులు ఇస్తామని పిలిపించి పట్టుకున్న పోలీసులు

నల్లబెల్లి వెలుగు : ఏసీబీ ఎస్సైనంటూ సర్వేయర్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను వరంగల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌జోన్‌‌‌‌ డీసీపీ రవికుమార్‌‌‌‌ సోమవారం నల్లబెల్లి పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్‌‌‌‌ జిల్లా వీణవంక మండలం మాది కనపర్తి గ్రామానికి చెందిన పత్తి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఆగస్టులో ఉమ్మడి వరంగల్‌‌‌‌ జిల్లా ల్యాండ్‌‌‌‌ రికార్డ్స్‌‌‌‌ ఏడీఏకు ఫోన్‌‌‌‌ చేసి తాను సీసీఎల్‌‌‌‌ఏ హెడ్‌‌‌‌ఆఫీస్‌‌‌‌ నుంచి మాట్లాడుతున్నానని, అన్ని మండలాల సర్వేయర్ల లిస్ట్‌‌‌‌ పంపాలంటూ ఓ మెయిల్‌‌‌‌ ఐడీ ఇచ్చారు. దీనిని నమ్మిన ఏడీఏ ఆఫీస్‌‌‌‌ సిబ్బంది సర్వేయర్ల లిస్ట్‌‌‌‌ను మెయిల్‌‌‌‌ ఐడీకి పంపించారు. 

దీంతో శ్రీనివాస్‌‌‌‌రెడ్డి పర్వతగిరి సర్వేయర్‌‌‌‌ శామ్యూల్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేసి తాను ఏసీబీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని, ఎఫ్‌‌‌‌ లైన్‌‌‌‌ పిటిషన్స్‌‌‌‌ వేసే క్రమంలో రైతుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదు వచ్చిందని భయపెట్టారు. ఎలాంటి కేసు లేకుండా చూసేందుకు రూ. 50 వేలు తీసుకొని రావాలని చెప్పారు. దీంతో సదరు సర్వేయర్‌‌‌‌ తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదని, ఏసీబీలో ఏ ర్యాంక్ ఏంటి ? ఎక్కడ పనిచేస్తున్నారని అడగడంతో శ్రీనివాస్‌‌‌‌రెడ్డి ఫోన్‌‌‌‌ కట్‌‌‌‌ చేశాడు. తర్వాత ఆగస్టు 16న నల్లబెల్లి సర్వేయర్​మీరాల మల్లయ్యకు ఫోన్‌‌‌‌ చేసి ఇదే తరహాలో రూ. లక్ష డిమాండ్‌‌‌‌ చేశాడు. దీంతో మల్లయ్య అదే రోజు మరో నంబర్‌‌‌‌ నుంచి రూ. 2 వేలు ఫోన్‌‌‌‌పే చేసి నల్లబెల్లి ఎస్సై నగేశ్‌‌‌‌కు ఫిర్యాదు చేశాడు.  శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మరోసారి మల్లయ్యకు ఫోన్‌‌‌‌ చేయడంతో తన అకౌంట్‌‌‌‌లో డబ్బులు లేవని, చేతిలో ఉన్నాయని, వస్తే స్వయంగా ఇస్తానని బదులిచ్చాడు. దీంతో శ్రీనివాస్‌‌‌‌రెడ్డి సోమవారం శనిగరం క్రాస్‌‌‌‌ రోడ్డుకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న పోలీసులు శ్రీనివాస్‌‌‌‌రెడ్డిని పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో14 కేసులు ఉన్నాయని డీసీపీ చెప్పారు. ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నర్సంపేట ఏసీపీ తిరుమల్, సీఐ పుల్యాల కిషన్, ఎస్సై నగేశ్‌‌‌‌ ఉన్నారు.