బషీర్ బాగ్, వెలుగు : సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం భారీ మొత్తంలో హవాలా డబ్బు పట్టుబడింది. వాహనాల తనిఖీలో పోలీసులు రూ.కోటి21లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్బజార్సీఐ శ్రీనివాసచారి, ఏసీపీ శంకర్, అడిషనల్ డీసీపీ నర్సయ్యతో కలిసి ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. సుల్తాన్బజార్పోలీసులు మంగళవారం సాయంత్రం బొగ్గులకుంటలో వాహనాల తనిఖీ చేపట్టారు.
ఆ సమయంలో అటుగా బైక్‌పై వచ్చిన ఇద్దరిని ఆపేందుకు యత్నించగా తప్పించుకున్నారు. కోఠి హనుమాన్ టెక్డీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరూ రాజస్థాన్ కు చెందిన లక్ష్మణ్ (27), వసంత్ (24)గా గుర్తించారు. వారి వద్ద ఉన్న బ్యాగులో రూ.కోటి క్యాష్దొరికింది. వారిచ్చిన సమాచారంతో హనుమాన్ వ్యాయామశాల సమీపంలోని ఓ అపార్ట్మెంట్ లో తనిఖీలు చేపట్టారు. అక్కడ రూ.21లక్షలు పట్టుబడ్డాయి.
అక్కడ ఉన్న తరుణ్ అనే వ్యక్తిని విచారించగా ముంబైలో ఉండే బబ్లూ అనే హవాలా వ్యాపారి కోసం తాము పనిచేస్తున్నామని ఒప్పుకున్నాడు. ముగ్గురిని అరెస్ట్‌చేసి, రూ.1.21కోట్లు సీజ్‌చేశామని డీసీపీ తెలిపారు.