వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై..పోలీసుల కొరడా

వడ్డీ , ఫైనాన్స్ వ్యాపారస్తులపై..పోలీసుల కొరడా
  •     అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న 14 మందిపై కేసులు
  •     16లక్షల నగదు, 359 డ్యాక్యూమెంట్లు స్వాధీనం 

రాజన్న సిరిసిల్ల,వెలుగు : ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని వ అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై రాజన్నసిరిసిల్ల పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి 14 మందిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వడ్డీ వ్యాపారం చేసి అమాయకులను మోసం చేస్తే చట్టపరమైన   చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు.  జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై ని గుర్తించే పనిలో పడ్డారు.

మొత్తం 24 పోలీస్​ టీమ్ లు 

 శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 టీమ్ ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. జిల్లాలోని అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 14 మంది పై పోలీసులు కేసులు నమోదు చేశారు.అక్రమ వ్యాపారుల నుంచి 16లక్షల పైగా నగదు సీజ్ చేశారు. 359 డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గామారింది. 

ఆమాయక ప్రజలే టార్గెట్

జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారస్తులు అమాయక,పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పుల ఇస్తున్నారు. అవసరానికి అప్పు తీసుకుని వారు నిర్ణయించిన కాలంలోగా కట్టకపోతే  , చక్రవడ్డీ వేస్తూ ఇచ్చిన దానికంటే పది రెట్లు వసూలు చేస్తున్నారు. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం చిట్టీలు నడిపిస్తూ అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నరన్నా ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపడంతో అక్రమ ఫైనాన్సియర్ లు జంకుతున్నారు.

ప్రభుత్వ అనుమతులు లేని ఫైనాన్స్ లు కోకోల్లలు

 జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఫైనాన్స్ లు నడిపిస్తున్నారు. ఓ నలుగురు వ్యాపారస్తులు కలిసి వివిద పేర్లతో ఫైనాన్స్ లు నడిపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారి సంఖ్య తక్కువే ఉన్నాయి. ఇటివంటి ఫైనాన్స్ లను మాత్రమే నమ్మాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ ఫైనాన్సు

 వ్యాపారం నడిపేవారి గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమాచారం ఇవ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. అలాగే స్థానిక పోలీసులకు,డయల్100 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ పోలీసులు సూచిస్తున్నారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఎస్పీ ప్రకటించారు. 

అక్రమ వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం

జిల్లాలో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. శనివారం ఒక్క రోజు 14 మంది అక్రమ వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. మరిన్ని తనిఖీలు చేపడతాం. అక్రమ ఫైనాన్స్ చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అనుమతులు లేని ఫైనాన్సియర్ లను నమ్మొద్దు. అక్రమ వడ్డీ దందా చేసే వారి సమచారం తెలిస్తే పోలీసులకు అందజేయాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్