‘గల్వాన్ లోయ’పై కామెంట్.. ట్వీట్ తొలగించి సారీ చెప్పిన రిచా చద్దా

‘గల్వాన్ లోయ’పై కామెంట్.. ట్వీట్ తొలగించి సారీ చెప్పిన రిచా చద్దా

ముంబై : గల్వాన్ లోయను ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ దుమారానికి దారితీసింది. ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఆమె తన ట్వీట్ ను తొలగించి క్షమాపణ చెప్పారు. తన ట్వీట్ తో మనోభావాలు దెబ్బతిన్న వారికి సారీ చెబుతున్నానని ఆమె మరో ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ట్వీట్ చేశారు. అందుకు రిచా చద్దా స్పందిస్తూ ‘గల్వాన్ కూడా అందుకు ఎదురుచూస్తోంది’ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్ వైరల్ గా మారింది.

మన జవాన్లను, వారి త్యాగాలను అవమానించేలా ట్వీట్ చేశావంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రిచా చద్దాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తర్వాత ఆమె తన ట్వీట్ ను డిలీట్ చేసి సారీ చెప్పారు. ‘‘సోల్జర్లను అవమానించాలన్నది నా ఉద్దేశం కాదు. నా కామెంట్ తో ఎవరి మనోభావాలైన దెబ్బతినుంటే అందుకు నేను సారీ చెప్తున్నా. మా తాత కూడా ఆర్మీలో పనిచేశారు. 1965లో ఇండియా–చైనా యుద్ధం సమయంలో ఆయన కాలిలో ఓ బులెట్ దిగింది. ఆర్మీలో ఆయన పారాట్రూపర్ గా సేవలందించారు. నా రక్తంలో కూడా దేశభక్తి ఉంది. ఒక సైనికుడు అమరుడైనా, గాయపడినా ఆయన కుటుంబం అంతా అఫెక్ట్ అవుతుంది. ఆ బాధ నాకూ తెలుసు” అని రిచా పేర్కొన్నారు.