
సూర్యాపేట, వెలుగు: హాస్టల్‌లో భోజనం పెట్టడం లేదంటూ పలువురు స్టూడెంట్లు పోలీసులను ఆశ్రయించారు. వార్డెన్ స్థానికంగా ఉండడం లేదని, విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టట్లేదని ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) ఎస్సీ సంక్షేమ శాఖ బాయ్స్ హాస్టల్‌లో 70 మంది స్టూడెంట్లు ఉంటున్నారు. బుధవారం 50 మందికే భోజనం సిద్ధం చేశారు. మిగిలిన 20 మందికి భోజనం లేకపోవడంతో స్టూడెంట్లంతా ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వార్డెన్ రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు.
స్టేషన్ సిబ్బంది ఎస్సై శ్రీకాంత్‌కు చెప్పడంతో అతడు స్టూడెంట్స్‌తో కలిసి హాస్టల్‌కు వెళ్లాడు. అక్కడ వార్డెన్ లేకపోవడంతో అతడికి సమాచారం ఇవ్వగా హాస్టల్‌కు చేరుకొని స్టూడెంట్లకు భోజనం ఏర్పాటు చేయించారు. అయితే స్టూడెంట్ల ఫిర్యాదుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆత్మకూరు(ఎస్) ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని వార్డెన్‌కు సూచించారు. ఈ విషయంపై గురువారం విచారణ జరిపి కలెక్టర్‌కు రిపోర్ట్ ఇస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి దయానంద రాణి తెలిపారు.