మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్‌

మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్‌

హైదరాబాద్ : పోలీసులు ఒకరిని మించి మరొకరు మంచి పనులు చేస్తూ ఫ్రెండ్లీ పోలీసులు అనిపించుకుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షంలో నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని పోలీసు ఎత్తుకెళ్లి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇలాంటి సంఘటనే మంగళవారం పంజగుట్ట దగ్గర జరిగింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి చెందిన ఓ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన మహిళను చేతుల్లో ఎత్తుకుని హస్పిటల్ లో చేర్చాడు. BS మక్తాకు చెందిన వెంకటరమణమూర్తి, సుధారాణి దంపతులు సోమవారం బైక్ పై రాజీవ్ సర్కిల్ నుంచి బేగంపేట వైపు వెళ్తున్నారు. అయితే వీరి బైక్ కు ఓ ఆటో దగ్గరగా రావడంతో..బైక్ అదుపుతప్పి కింద పడ్డారు.

వెంకటరణకు స్వల్ప గాయాలు కాగా.. సుధారాణి నడుము, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె నొప్పితో విలవిలలాడుతుండగా అక్కడే డ్యూటీలో ఉన్న పంజగుట్ట పెట్రోకార్‌ కానిస్టేబుల్‌ ఎన్‌.ప్రభు ఆమెను చేతులతో ఎత్తుకుని  సమీపంలోని వివేకానంద ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశాడు. రోడ్డుపై ఆమెను ఎత్తుకొస్తుండగా పలువురు తమ చేతుల్లో ఉన్న మొబైల్స్ కి పని చెప్పారు. క్లిక్ అనిపించి రియల్ హీరో..శభాష్ పోలీస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇదే విషయంపై డాక్టర్లు అడుగగా..ఆమె  అవస్థను చూడలేక ఎత్తుకుని తీసుకెళ్లినట్లు తెలిపాడు కానిస్టేబుల్ ప్రభు.