
- భక్తుల దాహార్తిని తీర్చడానికి నిధులు
- జాతర జరిగే ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వాటర్ క్యాంపులు
- ఈసారి 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 5 లక్షల బాటిళ్ల పంపిణీ
- దేవాలయాల పరిసరాల్లో డ్రైనేజీ పొంగకుండా ప్రత్యేక బృందాలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్లో ఆషాఢ మాస బోనాల జాతరకు మెట్రో వాటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఈసారి 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నది.
ఇటీవల గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలోనూ ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసింది. త్వరలో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి, లాల్‌దర్వాజ అమ్మవారి బోనాలతోపాటు ఇతర ప్రధాన దేవాలయాల వద్ద కూడా వాటర్ క్యాంపులు ఏర్పాటు చేసి, భక్తుల దాహార్తిని తీర్చడానికి సిద్ధమైంది. ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక నిధులను కూడా మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు.
జాతరలో డ్రైనేజీ సమస్యకు చెక్
బోనాల జాతర జరిగే దేవాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై గుంతలు లేకుండా బల్దియా రిపేర్లు చేస్తోంది. వాటర్బోర్డు అధికారులు ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
మ్యాన్‌హోళ్లపై మూతలు ఉండేలా చూడడం, ముఖ్యంగా డ్రైనేజీ ఓవర్‌ఫ్లో వంటి సమస్యలు లేకుండా ఆయా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. జాతర జరిగే ప్రాంతాల్లో ఒక ఎయిర్‌టెక్ మిషన్‌ను సిద్ధంగా ఉంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు వివరించారు.