
- ఉమ్మడి నల్గొండలో 5 వేల ఎకరాలకు పైగా భూసేకరణే లక్ష్యం
- బ్రాహ్మణ వెల్లెంల, గంధమల్ల, బస్వాపురం, నెల్లికల్లు, బొత్తాలపాలెం కిందే ఎక్కువ
నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా రైతులను కలిసి భూములు ఇవ్వాలని కోరుతున్నారు. భూములు ఇస్తే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెబుతున్నారు. అయితే పరిహారం విషయంలో రైతుల అసంతృప్తి ఒక కారణమైతే.. అప్పటి బీఆర్ఎస్ సర్కారు రైతులను ఒప్పించే విషయంపై దృష్టి సారించలేదు. బీఆర్ఎస్హయాంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు భూసేకరణ సమస్యను చూపించి పనులు చేపట్టకుండా వదిలేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఉమ్మడి జిల్లాలో 5 వేల ఎకరాలకు పైగా..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల కోసం 5 వేల ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉంది. పరిహారం ఎక్కువ కావాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. బ్రాహ్మణ వెల్లెంల కింద 2000 ఎకరాలు, నాగార్జునసాగర్‌లో నెల్లికల్లు ప్రాజెక్టు కింద 515 ఎకరాలు, దున్నపోతుల గండి కింద 34 ఎకరాలు, మిర్యాలగూడ పరిధిలో వాడపల్లి బొత్తులపాలెం కింద 45 ఎకరాలు, వీర్లపాలెం లిఫ్ట్ స్కీం కింద 21 ఎకరాలు, దేవరకొండ పరిధిలో అంబాభవాని, పొగిళ్ల, కంబాలపల్లి స్కీం పరిధిలో 71 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో చేపట్టిన బస్వాపురం రిజర్వాయర్ కోసం 1075 ఎకరాలను సేకరించాల్సి ఉంది. కాల్వల కోసం మరికొంత భూమి సేకరించాల్సి ఉంటుంది. ఆర్ అండ్ ఆర్ పెండింగ్ కారణంగా భూ సేకరణ సమస్య నెలకొంది. ఆలేరు నియోజకవర్గంలో 1.4 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టనున్న గంధమల్ల రిజర్వాయర్ కోసం వెయ్యి ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉంది. భువనగిరి, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు సంబంధించిన ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వల కోసం సుమారు 400 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది.
రైతులను ఒప్పించే బాధ్యత ఎమ్మెల్యేలదే..
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో చేపడుతున్న ప్రాజెక్టులకు అవసరమయ్యే భూములను సేకరించేందుకు రైతులను ఒప్పిస్తున్నారు. అదే చొరవతో ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో భూసేకరణపై దృష్టి పెడితే ప్రాజెక్టులు పూర్తవుతాయని ఇటీవల నల్గొండలో జరిగిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన సమీక్షలో ఇంజినీర్లు ప్రధానంగా భూ సమస్యనే ఎత్తిచూపారు.
బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్ట్ భూసేకరణ కోసం జేసీ, ఆర్డీవో, స్పెషల్ కలెక్టర్‌తో ప్రత్యేక టీమ్స్ ను నియమించారు. ఇక సాగర్‌లోని నెల్లికల్లు స్కీం కింద అటవీ భూముల సమస్య నడుస్తోంది. దీనిని కూడా త్వరలోనే పరిష్కరించాలని మంత్రులు.. ఎమ్మెల్యేలకు సూచించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద భూములు సేకరించిన చోట పనులు చేయాలని చెబుతున్న మేఘా సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుస్తుంది. ప్రాజెక్టు భూసేకరణ కింద ప్రభుత్వం సుమారు రూ.60 కోట్లు ఇటీవల రిలీజ్ చేసింది.
రిజర్వాయర్ డిజైన్‌లో పలు మార్పులు..
కట్టంగూరు మండలం చెర్వుఅన్నారం దగ్గర ప్రతిపాదించిన అయిటిపాముల రిజర్వాయర్ డిజైన్‌లో పలు మార్పులు చేశారు. రిజర్వాయర్ నుంచి రెండు పైపులైన్ల ద్వారా నీటిని పంపణీ చేసినట్టయితే భూసేకరణ విషయంలో వెసులుబాటు కలుగుతుందని భావించి మార్పులు చేశారు. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వతోపాటు బస్వాపురం రిజర్వాయర్ విషయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు. గంధమల్ల రిజర్వాయర్ భూ సేకరణపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు రైతులతో చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు కూడా భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు.