ముంపు ముప్పు రాకుండా ముందస్తు చర్యలు..గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు కరకట్ట బలోపేతం

ముంపు ముప్పు రాకుండా ముందస్తు చర్యలు..గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు కరకట్ట బలోపేతం
  • భద్రాచలం వద్ద యుద్ధప్రాతిపదికన పనులు
  • స్లూయిజ్​ల వద్ద ఇసుక బస్తాలు
  • బ్యాక్​ వాటర్​ ఎత్తిపోసేందుకు కొత్తగా 250 హెచ్​పీ మోటార్లు

వానకాలం మొదలు కావడంతో  గోదావరి ముంపు గ్రామాల్లో అలజడి మొదలైంది. గతంలో పలు గ్రామాలకు ముంపునకు గురైన చేదు అనుభవాలు ఉండడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్​ అయింది. కరకట్టలను బందోబస్తు చేసే పనిలో నిమగ్నమైంది. స్లూయిజ్​ల వద్ద ఇసుక బస్తాలు రెడీగా ఉంచి ఎంతటి వరద వచ్చినా ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటోంది. మరోవైపు భద్రాచలం పట్టణాన్ని బ్యాక్​ వాటర్​ నుంచి కాపాడేందుకు 250 హెచ్​పీ సామర్థ్యం  గల మోటార్లను తెప్పించారు.

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రుతుపవనాలు, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల వల్ల కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా  వానలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి పరివాహకం అతలాకుతలం అవుతోంది. వాగులు, ఉపనదుల నుంచి నీరు గోదావరిలో కలుస్తుండటంతో భద్రాచలం వద్ద వరద పెరుగుతోంది.

 గరిష్ఠంగా 20 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి.పాటిల్​, ఐటీడీఏ పీవో బి.రాహుల్​ నేతృత్వంలో ఆర్డీవో దామోదర్​ వరద నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. నీటి పారుదల శాఖ ఇంజినీర్లు భద్రాచలం కరకట్ట వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. లాంచీ, స్పీడ్ బోట్లు, అగ్నిమాపక సిబ్బందితో కూడిన రెస్క్యూ టీంలను రెడీ చేశారు. కరకట్ట స్లూయిజ్​ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు. 

బ్యాక్​ వాటర్​ను తోడేందుకు మోటార్లు..

వరదల సమయంలో కరకట్టపై ఉన్న స్లూయిజ్​లు మూసివేస్తే టౌన్​లో కురిసే వాన, డ్రైన్​ వాటర్​ మొత్తం రామాలయం విస్తా కాంప్లెక్స్ వద్ద చేరుతుంది. ఈ బ్యాక్ వాటర్​ వల్ల రామాలయం పరిసరాలు నీట మునుగుతుంటాయి. వచ్చిన నీటిని వచ్చినట్లుగా గోదావరిలోకి డంప్​ చేసేందుకు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 50 హెచ్​పీ సామర్థ్యం గల మోటార్లు ఐదు ఉండగా, 250 హెచ్​పీ సామర్థ్యం గల మరో నాలుగు మోటార్లను మిర్యాలగూడెం నుంచి తెప్పించారు. 

వాటిని కూడా బిగిస్తున్నారు. ఈఈ జానీ, డీఈ మధుసూధన్​రావు, జేఈ వెంకటేశ్​ పర్యవేక్షణలో సీడబ్ల్యూసీ ఇంజినీర్ల నుంచి వచ్చే రెయిన్​ఫాల్స్ రిపోర్టుల ఆధారంగా నిరంతరం మోటార్లు పనిచేస్తాయి. ఈ మోటార్లకు విద్యుత్​ అంతరాయం రాకుండా ట్రాన్స్ కో ఆఫీసర్లు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయగా, ముందస్తు జాగ్రత్తగా జనరేటర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. వరద నీరు, వర్షం నీరు టౌన్​లోకి రాకుండా పటిష్టమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేస్తోంది.