కరోనా లక్షణాలున్నాయి అంటున్నా డ్యూటీ వేయడంతో..

కరోనా లక్షణాలున్నాయి అంటున్నా డ్యూటీ వేయడంతో..
  • తీవ్ర అస్వస్థతకు గురైన కానిస్టేబుల్ గణేష్
  •  హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
  • అంబులెన్స్‌లోనే ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసి  షేర్ చేసిన కానిస్టేబుల్
  • అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘటన

అనంతపురం: కరోనా మహమ్మారి సునామీ విరుచుకుపడుతున్న వేళ కానిస్టేబుల్ జీవితంతో చెలగాటం ఆడిన ఘటన కలకలం రేపుతోంది. కాస్త విశ్రాంతి ఇవ్వమని అడుక్కున్నా పట్టించుకోకుండా డ్యూటీ వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురై.. ఆస్పత్రి పాలయ్యాడు. ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో హుటాహుటిన అంబులెన్స్ లో తరలిస్తుండగా.. సెల్ఫీ వీడియో తీసుకున్న సదరు కానిస్టేబుల్ దాన్ని వెంటనే షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. తనకు కరోనా లక్షణాలున్నాయని.. కాస్త విశ్రాంతి అవసరమని ఎస్.ఐ ఖాజాహుశేన్ ను పదేపదే వేడుకున్నా ఆయన పట్టించుకోలేదని.. ఇప్పుడు తనను ఇలా అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ.. నాకు ఏదైనా జరిగితే దానికి ఎస్.ఐ ఖాజాహుశేన్ దే బాధ్యత అంటూ సెల్ఫీలో వాపోయాడు కానిస్టేబుల్ గణేష్.  

తాడిపత్రి రూరల్ కానిస్టేబుల్ గణేష్ నెల 20న కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. తొలిసారి నెగటివ్ రావడంతో కానిస్టేబుల్ గణేష్‌కు ఎస్ఐ ఖాజాహుస్సేన్ కోర్టు డ్యూటీ వేశారు. అయితే ఆ తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. ఊపిరి తీసుకోలేక ఇబ్బందిపడుతుండడంతో నిస్టేబుల్‌ గ హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ లో తనను తరలిస్తుండగా.. కానిస్టేబుల్ గణేష్ తన మొబైల్ ఆన్ చేసుకుని.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తాను కోవిడ్  బారిన పడినా ఎస్‌ఐ ఖాజా హుస్సేన్ ట్రాఫిక్ డ్యూటీ వేసి వేధించారంటూ గణేష్ అంబులెన్స్‌లో నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలను ఎస్ఐలు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఒకవేళ తాను చనిపోతే.. తన చావుకు ఎస్ఐ ఖాజా హుస్సేన్ కారణమంటూ కానిస్టేబుల్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్ సెల్ఫీ వీడియోపై స్పందించిన జిల్లా ఎస్పీ

తాడిపత్రి రూరల్ కానిస్టేబుల్ గణేష్ కుమార్ సెల్ఫీ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి. సత్య ఏసుబాబు  స్పందించారు. వెంటనే ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఆరా తీశారు. తాడిపత్రి రూరల్ కానిస్టేబుల్ గణేష్ కుమార్ ఆరోగ్యం, చికిత్స విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రస్తుతం ఆయన జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియాకు వెల్లడించారు. అదృష్టవశాత్తు ఆక్సిజన్ శాచురేషన్ , పల్స్ రేట్ , ఇతర హెల్త్ పారా మీటర్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈనెల 21 వ తేదీన గణేష్ కుమార్ తో పాటు మరి కొందరు సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారని, హెచ్ఆర్సీటీ చేయించగా అందులోనే రిపోర్ట్ సాధారణంగానే( నెగెటివ్ ) వచ్చిందన్నారు. దీంతో అతన్ని 3 రోజులు పర్మిషన్ పై పంపామని.. మళ్లీ నిర్వహించిన పరీక్షల్లో నిన్నటి రోజు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో ఏమాత్రం అలసత్వం లేకుండా అతనిని తాడిపత్రి నుండి అంబులెన్సులో పంపి జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీలో జాయిన్ చేయించామన్నారు. కానిస్టేబుల్ గణేష్ ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని, కరోనా పాజిటివ్ రాగానే ఆ ఎమోషన్ లో ఎస్సైపై ఆరోపణలు చేయడం జరిగిందని వివరించారు. గణేష్ కుమార్ ఆరోగ్యం... కరోనాకు చికిత్స ఇప్పించడంలోనే కాదు.. డిశ్చార్జి అయ్యేంత వరకు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు. ప్రజల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా  కరోనా కట్టడికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యావత్తు పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోందని,  ఈక్రమంలో పోలీసు సిబ్బందిలో ఎవరికి కరోనా లక్షణాలు అగుపించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్నివిధాల జాగ్రత్తలు, సహాయక చర్యలు, చికిత్స అందేలా కార్యాచరణతో ముందుకెళ్తున్నామని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు వివరించారు.