
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకుంది నందితా శ్వేత. తర్వాత గ్లామర్ రోల్స్‌తో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తోనూ ఆకట్టుకుంది. తాజాగా అశ్విన్ బాబుకి జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా జులై 20న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా నందిత చెప్పిన విశేషాలు.
‘‘ ఇది వరకు కొన్ని థ్రిల్లర్స్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. ఇందులో పోలీస్ రోల్‌లో కనిపిస్తా. ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే ఫిట్‌నెస్ ముఖ్యం. దీనికోసం ప్రతిరోజూ స్పెషల్ వర్కవుట్స్ చేశాను. తర్వాత లుక్ టెస్ట్ చేసి, ఖాకీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇదొక యూనిక్ డిఫరెంట్ థ్రిల్లర్. హీరోకి సమానంగా ఉండే బలమైన పాత్ర నాది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హీరోకి నేను సీనియర్‌ని. నాపాత్రలో కమాండింగ్ ఉంటుంది. ఇంత స్ట్రాంగ్ రోల్ చేసినప్పుడు బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్‌లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దర్శకుడు ఐపీసి సెక్షన్స్ గురించి కొన్ని డైలాగ్స్ రాశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాత్ర చేయడం ఛాలెంజింగ్ అనిపించింది. అశ్విన్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ కష్టం ట్రైలర్‌లో అందరికీ కనిపించింది.
ఇందులో మా మధ్య చాలా కాంబినేషన్ సీన్లు ఉంటాయి. తనతో వర్క్ చేయడం మంచి అనుభవం. సినిమా మేకింగ్ పరంగా చాలా క్వాలిటీ ఉంటుంది. డిఫరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. దర్శకుడు అనిల్ చేసిన పని తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ‘హిడింబ’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు. నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. వచ్చిన పాత్రకు ఎంత న్యాయం చేయగలను అనే దానిపైనే దృష్టి పెట్టాను. ఈ చిత్రంతో స్టార్‌డమ్ వస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అజయ్ భూపతి రూపొందిస్తున్న ‘మంగళవారం’ సినిమాలో నటిస్తున్నా. అలాగే తమిళంలో మూడు చిత్రాలు, తెలుగులో మరో రెండు చిత్రాలు చేస్తున్నా’’.