ఒక్క కంపెనీ బ్యాంక్​ని ముంచేసింది

ఒక్క కంపెనీ బ్యాంక్​ని ముంచేసింది

ముంబైఇండియాలో బ్యాంక్‌‌ స్కాములు ఆగకుండా సాగుతున్నాయి. ఇంక చెడు వార్తలు ఉండవేమో అనుకునేంతలోనే వేల కోట్ల రూపాయల బ్యాంక్‌‌ స్కాము బయటపడుతోంది. ఇప్పటిదాకా జరిగిన బ్యాంకు స్కాములు ఒక ఎత్తైతే, తాజాగా పంజాబ్‌‌ అండ్‌‌ మహారాష్ట్ర కో–ఆపరేటివ్‌‌ బ్యాంకులో స్కాము మరో ఎత్తు. తీవ్రమైన ఇబ్బందుల్లోని ఇండియా ఫైనాన్షియల్‌‌ సిస్టమ్‌‌ను ఈ స్కాము  మరో కుదుపు కుదిపింది. ఈ నేపథ్యంలో వ్యవస్థను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరవుతుంది.

పీఎంసీ బ్యాంకు డిపాజిటర్లు రూ. వెయ్యికి మించి విత్‌‌ డ్రా చేయకూడదనే రిజర్వ్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఆర్‌‌బీఐ) ప్రకటనతో సమస్య వెలుగులోకి వచ్చింది. కిందటి వారం చివరలో ఎలాంటి వివరణా ఇవ్వకుండానే ఆర్‌‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలలపాటు ఇది కొనసాగుతుందని కూడా అందులో పేర్కొంది. నిజానికి అదో పెద్ద పొరపాటు. పీఎంసీ బ్యాంకు చాలా చిన్న బ్యాంకు. లిస్టింగ్‌‌ కూడా లేదు. కాకపోతే దేశపు ఆర్థిక రాజధాని కావడంతో ముంబైలో  చిన్న డిపాజిటర్లకు ఈ బ్యాంకు ఆకర్షణీయంగా కొనసాగింది. ప్రజలు, మీడియా వత్తిడి పెరగడంతో డిపాజిటర్ల విత్‌‌డ్రాయల్స్‌‌ పరిమితిని ఆర్‌‌బీఐ రూ. 10 వేలకు పెంచింది. అలా పెంచేటప్పుడు ఎందుకు చర్యలు తీసుకుంటోందో వెల్లడించింది. బ్యాంకులో ఆర్థికపరమైన అవకతవకలు చోటు చేసుకున్నాయని, అంతర్గత నియంత్రణ విఫలమైందని, నిబంధనల ప్రకారం ఆర్థిక వివరాలను బ్యాంకు వెల్లడించలేదని కూడా ఆర్‌‌బీఐ పేర్కొంది.

మొత్తం అప్పుల్లో 73 శాతం ఒకే ఒక్క కస్టమర్‌‌‌‌కి…

పంజాబ్‌‌ అండ్‌‌ మహారాష్ట్ర కో–ఆపరేటివ్‌‌ బ్యాంకు మునిగిపోవడానికి అప్పు తీసుకున్న  ఒకే ఒక్క క్లయింట్‌‌ కారణమంటే ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బ్యాంకుకు మొన్నటిదాకా మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌గా వ్యవహరించిన వ్యక్తే ఈ నిజాన్ని బైటపెట్టారు. బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో 73 శాతాన్ని ఒకే ఒక్క కస్టమర్‌‌కు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకు ఇచ్చిన మొత్తం అప్పులు రూ. 8,800 కోట్లు. ఇలా అప్పు తీసుకున్న గ్రూప్‌‌ హౌసింగ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ లిమిటెడ్‌‌. ముంబైకే చెందిన రియల్‌‌ఎస్టేట్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కంపెనీ ఇప్పటికే బ్యాంక్‌‌రప్టసీ (దివాలా) చర్యలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సస్పెన్షన్‌‌ ఎదుర్కొంటున్న మేనేజింగ్‌‌ డైరెక్టర్ ఆర్‌‌బీఐకి రాసిన లెటర్‌‌ బైటకు రావడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

హెచ్‌‌డీఐఎల్‌‌కు ఇచ్చిన అప్పులు రెండో వంతా లేక మూడో వంతా అనేది పక్కన పెడితే, అసలు ఇచ్చిన అప్పుల మొత్తానికి బ్యాంకు మూలధనానికి పొంతన లేదని చెబుతున్నారు. ఇలా అప్పు ఇవ్వడం కేవలం పొరపాటుగా పరిగణించలేము. టాప్‌‌ పొజిషన్స్‌‌లో ఉన్న వ్యక్తుల నిర్లక్ష్యవైఖరే దీనికి కారణంగా చెప్పుకోవల్సి ఉంటుంది. తన క్యాపిటల్‌‌ యాడిక్వసీ రేషియో (సీఏఆర్‌‌) నిబంధనల ప్రకారం ఉండాల్సిన 12 శాతం కంటే ఎక్కువేనని, ఎన్‌‌పీఏలూ నాలుగు శాతం లోపేనని పీఎంసీ యాన్యువల్‌‌ రిపోర్ట్‌‌లో చెప్పుకుంది. ఇండియాలోని బ్యాంకింగ్‌‌ స్టాండర్డ్స్‌‌ ప్రకారం ఈ సీఏఆర్‌‌, ఎన్‌‌పీఏ పరిమితులు ఒప్పుకోదగ్గవే. ఐతే, తాజాగా బైటకొచ్చిన వార్తలు నిజమైతే బ్యాంకు తన యాన్యువల్‌‌ రిపోర్టులో ప్రకటించిన అంకెలు అబద్దాలవుతాయి. ఇంత జరుగుతున్నా, పీఎంసీ బోర్డు, ఆడిటర్లు, ఆర్‌‌బీఐలకు ఇంత కాలం తెలియకుండా ఎలా ఉందనేది ఇప్పుడు అందరి ముందూ ఉన్న ప్రశ్న. ఇప్పటిదాకా ఇంకా ఎవరినీ దోషులుగా తేల్చలేదు. మొత్తం భారాన్నంతా డిపాజిటర్ల మీదే నెట్టేశారు. అమాయకులైన డిపాజిటర్లే ఈ బ్యాంకు ఉదంతంలోనూ మరోసారి బలిపశువులుగా మారారు.

పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ స్కాములో నీరవ్‌‌ మోడి, మెహుల్‌‌ ఛోక్సిల అప్పుల భారాన్ని బ్యాంకు మోస్తున్నట్లు వెల్లడైంది. సుమారు రూ. 14,000 కోట్ల భారాన్ని వారి కోసం  పీఎన్‌‌బీ తన నెత్తిన వేసుకున్నట్లు తేలింది. వారికి డబ్బులు సమకూర్చడానికి విదేశాలలోని ఇండియా బ్యాంకుల బ్రాంచ్‌‌లకు స్విఫ్ట్‌‌ మెసేజ్‌‌లు పంపడం ద్వారా పీఎన్‌‌బీ ఆ నేరగాళ్లకు సాయపడిందని దర్యాప్తు తేల్చింది. పేమెంట్లను జరిపేందుకు బ్యాంకులు గ్లోబల్‌‌గా వాడే పద్ధతే స్విఫ్ట్. ఐతే, ఈ అప్పులేవీ పీఎన్‌‌బీ ఖాతా పుస్తకాలలో కనబడలేదు. ఇందుకు విరుద్ధంగా పీఎంసీ విషయం చూస్తే, బ్యాంకు కార్యకలాపాల మూలంలోనే లోపాలున్నట్లు తెలుస్తుంది.

రియల్ఎస్టేటే తలనొప్పి

ఇండియాలో రియల్‌‌ ఎస్టేట్‌‌ మార్కెట్‌‌ పెద్ద తలనొప్పిగా మారింది. ప్రోపర్టీ డెవలపర్లు దొరికిన చోటల్లా, తలకు మించిన అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి అపార్ట్‌‌మెంట్లు డెలివరీ ఇవ్వలేని స్థితిలో పడిపోయారు. రియల్‌‌ ఎస్టేట్‌‌ డెవలపర్ల ఇబ్బందుల ప్రభావం షాడో బ్యాంకులు (నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీలు)పై పడింది. దాంతో బిల్డర్లకు ఇచ్చిన అప్పులపై రీఫైనాన్స్‌‌ దొరక్క ఆ షాడో బ్యాంకులు సమస్యల్లో చిక్కుకున్నాయి. తాజా పీఎంసీ స్కాండల్‌‌ నేపథ్యంలో డిపాజిట్లు తీసుకునే సంస్థలన్నింటిపైనా ప్రజలకు విశ్వాసం పోయే పరిస్థితి దాపురించినట్లే. మార్కెట్లో ఎక్కువ నమ్మకం కలిగించ గలిగే బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తితే, మరోవైపు అంతగా విశ్వాసం పొందలేని బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీల డిపాజిట్లు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ప్రస్తుతమున్న లిక్విడిటీ సంక్షోభ సమయంలో బలహీనమైన బ్యాంకులలో మరిన్ని లొసుగులు బైటపడే అవకాశాలనీ తోసిపుచ్చలేము. పీఎంసీ బ్యాంకు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోయినా, ఇండియా బ్యాంకింగ్‌‌ వ్యవస్థకు ఒక కనువిప్పులాంటిదేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.