నవీన్ రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

నవీన్ రెడ్డి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

మన్నెగూడ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవీన్ రెడ్డిని వారం రోజులపాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఐదుగురు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.  నిన్న నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడు నవీన్ రెడ్డిని కస్టడీ లోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగు లోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. 

మన్నెగూడ కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ నిరాకరించినందునే వైశాలిని వేధించినట్లు నవీన్ రెడ్డి అంగీకరించాడు. వైశాలి స్నేహితురాలి ద్వారా తనకు ఆమె పరిచయమైందని నవీన్ పోలీసులకు చెప్పాడు. వైశాలితో కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాడినని, ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రపోజల్ ను వైశాలి ముందు పెట్టానని అన్నాడు. ఆమె తన ప్రేమను నిరాకరించడంతో వైశాలి తండ్రికి విషయం చెప్పినా వారు కూడా అంగీకరించలేదని దీంతో ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో వేధింపులు మొదలుపెట్టానని నవీన్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు ఆమె ఇంటి ముందు ల్యాండ్ తీసుకుని షెడ్ వేశానని నవీన్ రెడ్డి చెప్పాడు. వైశాలికి నిశ్చితార్థం జరుగుతుందని తెలుసుకున్న తాను తన వద్ద పని చేసే వారందరిని తీసుకెళ్లి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు అంగీకరించాడు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో ఆమెను చిత్రహింసలు పెట్టినట్లు చెప్పాడు. పోలీసులు తన కోసం వెతుకుతున్న విషయం తెలిసి వైశాలిని క్షేమంగా ఆమె ఇంటి వద్ద వదిలి తాను గోవాకు పారిపోయినట్లు నవీన్ రెడ్డి వెల్లడించాడు. వైశాలిపై అమితమైన ప్రేమ ఉన్నందునే ఆమెను క్షేమంగా ఇంటికి పంపించినట్లు పోలీసులకు చెప్పాడు