ప్రీతి కేసులో నిందితుడిపై ర్యాగింగ్, అట్రాసిటీ కేసులు

ప్రీతి కేసులో నిందితుడిపై ర్యాగింగ్, అట్రాసిటీ కేసులు

కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తోపాటు ర్యాగింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఇదే విషయాన్ని వరంగల్ ఏసీపీ బోనాల కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

బాధితురాలు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని వరంగల్ ఏసీపీ తెలిపారు. ప్రీతిని సైఫ్ గత కొంతకాలంగా వేధిస్తున్నట్లు వాట్సాప్ చాటింగ్ ద్వారా గుర్తించామని చెప్పారు. విచారణలో నిందితుడి వద్ద నుండి కూడా కొంతమేరకు సమాచారం సేకరించామన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులేనని స్పష్టం చేశారు. ప్రీతి కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరగకుండానే.. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం సరైనది కాదని, ఈ విషయంలో అందరూ సంయవనం పాటించాలని కోరారు. 

మరోవైపు.. మొదటి నుంచి కూడా ప్రీతి తండ్రి సైఫ్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు  ఆత్మహత్యాయత్నానికి సైఫే కారణమని చెబుతున్నారు.