
అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడింది. స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు మీడియాకు వివరాలను వెల్లడించారు. పట్టణంలోని భద్రాచలం రోడ్ లో ఎస్సై యయాతి రాజు వెహికల్స్తనిఖీ చేస్తుండగా ఊట్లపల్లి వైపు నుంచి అశ్వారావుపేట వైపు మూడు బైకులపై ఏడుగురు వ్యక్తుల వస్తూ పోలీసులను చూసి పారిపోతున్నారు.
వారిని పోలీసులు ఛేజ్ చేసి పట్టుకోగా వారి వద్ద రూ.2.75 లక్షలు విలువ చేసే 5.5 కేజీల గంజాయి పట్టుబడింది. నిందితులు అశ్వారావుపేట పట్టణానికి చెందిన షేక్ ఫిరోజ్ ఖాన్, గండికోట ప్రభు కుమార్, పసుపులేటి గోపీచంద్ కాగా, ఏపీలోని జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన పుట్ట జగదీశ్, గుంటూరు జిల్లా శ్యామలపురం మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన ఆవుల సుధీర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన తిరువీధుల కార్తీక్, హైదరాబాద్ కు చెందిన బుల్లా సంజయ్ గా గుర్తించారు.
వారి నుంచి గంజాయితోపాటు 6 సెల్ ఫోన్లు, మూడు బైక్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు పంపుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రామ్మూర్తి, హెడ్ కానిస్టేబుల్ నాగేంద్రరావు, పీసీలు హరిబాబు, కృష్ణ ప్రసాద్, రమేశ్ రావు, రామకృష్ణ, నరేశ్బాబు, భానుచందర్, వెంకటేశ్వరరావు, సంతోష్ పాల్గొన్నారు.