ముస్తాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఆగస్టులో జరిగిన వృద్ధుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎకరా భూమి కోసం కొడుకే ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. వివరాలను సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి శనివారం వెల్లడించారు. గూడెం గ్రామానికి చెందిన పిట్టల దేవయ్య(60)కు చందు ఒక్కడే కొడుకు.
తండ్రీకొడుకులు కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. చందు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే దేవయ్య తన పేరున ఉన్న రెండు ఎకరాల్లో ఒక ఎకరం అమ్మి ట్రీట్‌మెంట్ ఇప్పించాడు. ఆ తరువాత తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరిగాయి. తండ్రిని చంపితే గొడవలు ఆగడంతో పాటు, మిగిలిన ఎకరం పొలాన్ని కూడా అమ్ముకోవచ్చని చందు భావించాడు.
ఆగస్టు 11న దేవయ్య మద్యం మత్తులో ఉండగా గొంతు నులిమి చంపేశాడు. తరువాత తనకేమీ తెలియనట్లు పనికి వెళ్లాడు. మృతుడి సోదరుడు పిట్టల లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో చందు హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
తాగిన మైకంలో తల్లిని హతమార్చిన కొడుకు..
వరంగల్ సిటీ: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తల్లిని హత్య చేశాడు. ఇంతేజార్ గంజ్ సీఐ సుకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాశిబుగ్గకు చెందిన కూరపాటి రాజేశ్వర్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అతడి భార్య, కొడుకు వేరుగా ఉంటున్నారు. రాజేశ్వర్ తన తల్లి కూరపాటి వెంకటమ్మ(65)తో కలిసి ఉంటున్నాడు. నిత్యం తాగొచ్చి ఆమెతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి సైతం తాగొచ్చి తల్లితో గొడవ పడి పక్కనే ఉన్న బండరాయితో కొట్టి హత్య చేశాడు.
