
- ఈవెంట్లకు పది రోజుల ముందే పర్మిషన్ తప్పనిసరి
- సీసీటీవీ కెమెరాలు,సెక్యూరిటీ బాధ్యత నిర్వాహకులదే
- గైడ్ లైన్స్ విడుదల చేసిన సిటీ పోలీసులు
హైదరాబాద్, వెలుగు : సిటీలో జరిగే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్లానింగ్ రూపొందించారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈవెంట్లలో మహిళలకు సెక్యూరిటీ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ వాడకంపై నిఘా పెట్టాలన్నారు.
న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలని గైడ్‌లైన్స్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి పబ్స్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. ఈవెంట్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. కెపాసిటీకి మించి పాసులు జారీ చేయవద్దని తెలిపారు. సెమీ న్యూడ్ డ్యాన్స్ లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
డీజే సిస్టమ్ నుంచి సౌండ్ 45 డెసిబుల్స్ దాటొద్దని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఈవెంట్లకు మైనర్లను అనుమతించవద్దని ఆదేశించారు. డ్రగ్స్ కస్టమర్లు, సప్లయర్లపై నిఘా పెట్టామన్నారు. రూల్స్ పాటించని వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. డిసెంబర్ 31 రాత్రి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
మద్యం తాగి వెహికల్ నడిపిన వారికి బ్రీత్ అనలైజర్ టెస్టులో 30 ఎంజీ ఆల్కహల్ కంటెంట్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం మత్తులో ఉన్న వారిని టెంపరరీ కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. కేసులు నమోదు చేసి వారిని కోర్టులో ప్రవేశపెడతామన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడంతో పాటు రూ.10 వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష ఉంటుందని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెహికల్స్‌కు పూర్తి బాధ్యత ఓనర్లదేనని సూచించారు.
స్టార్ హోటల్స్, క్లబ్స్, పబ్ లు, రెస్టారెంట్లకు గైడ్‌లైన్స్
- ఈవెంట్లకు 10 రోజుల ముందుగానే స్థానిక పీఎస్ నుంచి అనుమతి తీసుకోవాలి
- డిసెంబర్ 31 అర్ధరాత్రి 1 గంట వరకే వేడుకలకు అనుమతి
- డ్రగ్స్ వాడకంపై పూర్తిగా నిషేధం. ఈవెంట్ల లోపల, పార్కింగ్ ఏరియాల్లో డ్రగ్స్ అమ్మడం, వాడటం చేస్తే సీరియస్ యాక్షన్
- ఈవెంట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి
- సెక్యూరిటీ గార్డులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం సిబ్బందిని నియమించాలి
- అసభ్యకర డ్యాన్స్‌లు, పదాలతో మ్యూజికల్ ఈవెంట్లు నిర్వహించడంపై నిషేధం
- ఈవెంట్లలో 45 డెసిబుల్స్ కంటే తక్కువగా సౌండ్ సిస్టమ్ ఉండాలి.
- గన్స్,పేలుడు పదార్ధాలను సెలబ్రేషన్స్‌లోకి అనుమతించకూడదు.
- ఈవెంట్లలో కెపాసిటీకి మించి పాస్‌లు, టికెట్లు, కూపన్స్ ఇవ్వొద్దు.
- ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా స్పెషల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి
- పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో నిర్వహించే ఈవెంట్లకు మైనర్లను అనుమతించొద్దు
- లిక్కర్ సర్వీస్ కోసం ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తప్పనిసరి
- డ్రంకెన్ డ్రైవ్ కండీషన్ లో ఉన్న వారి కోసం డ్రైవర్లు, క్యాబ్ లను ఏర్పాటు చేయాలి
- ఫైర్ డిపార్ట్ మెంట్ రూల్స్ ప్రకారం పర్మిషన్ తీసుకొని ఈవెంట్లను నిర్వహించాలి