
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానులకి ఒక ప్రత్యేకమైన అనుభూతి. 'సత్య' లాంటి సినిమాతో చరిత్ర సృష్టించిన ఈ ఇద్దరు దిగ్గజాలు చాలా కాలం తర్వాత మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. వీరి చివరి చిత్రం అమితాబ్ బచ్చన్ నటించిన 'సర్కార్ 3'. ఇప్పుడు వీరిద్దరు ఒక థ్రిల్లర్ కోసం జతకట్టింది. హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.
కథాంశం..
ఈ సినిమా పేరు 'పోలీస్ స్టేషన్ మే భూత్' ( పోలీస్ స్టేషన్‌లో దెయ్యం). ఈ సినిమా కథాంశం గురించి రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మనం భయపడినప్పుడు పోలీసుల వద్దకి వెళ్తాం. మరి పోలీసులే భయపడితే ఎక్కడికి వెళ్తారు? అనే ఆసక్తికరమైన ప్రశ్న చుట్టూ ఈ కథ ఉంటుందని తెలిపారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఒక పోలీసు అధికారి ఒక గ్యాంగ్‌స్టర్‌ని చంపడం, ఆ గ్యాంగ్‌స్టర్ దెయ్యంగా మారి పోలీస్ స్టేషన్‌ని వెంటాడడం అనే థీమ్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ హారర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే..
రామ్‌గోపాల్ వర్మ , మనోజ్ బాజ్‌పాయ్ కలిసి 'సత్య', 'శూల్', 'కౌన్', 'దౌడ్', 'సర్కార్ 3' వంటి ఎన్నో సినిమాల్లో పనిచేశారు. ముఖ్యంగా 'సత్య'లో మనోజ్ బాజ్‌పాయ్ పోషించిన భికు మత్రే పాత్ర సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ పాత్ర మనోజ్ కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. మనోజ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇది పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే, కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు.
హారర్ జానర్‌లో..
ఈ సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా దేశ్‌ముఖ్ నటిస్తున్నారు. మనోజ్ నటనలోని తీవ్రత, జెనీలియాలోని సున్నితత్వం ఈ హారర్ కథకు కొత్త కోణాన్ని అందిస్తుంది. ఈ చిత్రంతో హారర్ జానర్‌లో కొత్త సరిహద్దులు సృష్టించాలని ప్రయత్నిస్తునట్లు వర్మ వివరించారు. ఈ కథాంశం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోందని చెప్పారు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, సంభాషణలు ప్రేక్షకులను చివరి వరకు సీటు అంచున కూర్చోబెడతాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమాతో వర్మ తన పాత ఫామ్‌ను తిరిగి అందుకుని, హారర్ థ్రిల్లర్ జానర్‌లో మరో విజయాన్ని సాధిస్తారని సినీ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త మనోజ్ బాజ్‌పాయ్, వర్మ అభిమానుల్లో తీవ్ర ఉత్సుకతను పెంచింది.