- సాంకేతిక ఆధారాల సేకరణలో సవాళ్లు
- ఫోన్ ట్యాపింగ్‌పై సాంకేతిక ఆధారాల సేకరణలో సవాళ్లు
- నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు
- కీలకంగా మారిన ఇంటర్నెట్ ప్రొవైడర్లు
- ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు
- మలేషియా, ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం డబ్బులు అందించిన ఎమ్మెల్సీ
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. హార్డ్ డిస్క్‌లు, రికార్డులు ధ్వంసం కావడంతో ట్యాపింగ్‌కు అవసరమైన సాంకేతిక ఆధారాల సేకరణలో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే స్పెషల్ టీమ్ పోలీసులు ముందుకెళ్తున్నారు. సాంకేతిక ఆధారాల కోసం బేగంపేటలోని ఎస్‌ఐబీకి అనుసంధానమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.ఇందుకు సంబంధించి మూడు కంపెనీలకు చెందిన సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో పాటు సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం రూ.కోట్లు సమకూర్చినట్టు భావిస్తున్న ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇవ్వనున్నారు. ప్రధాన నిందితుడైన మాజీ డీఏస్పీ దుగ్యాల ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ కేసులో కీలకంగా మారింది.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ (ఎస్‌ఓటీ) చీఫ్‌గా ప్రణీత్ రావు నిర్వహించిన ఆపరేషన్లపై ఆరా తీస్తున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఇప్పటికే అరెస్టు చేశారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం రాధాకిషన్ రావును ఏడు రోజుల కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఎస్‌ఐబీ ఆపరేషన్ల గురించే వివరాలు సేకరిస్తున్నారు. ఎస్‌ఐబీలోని రెండు లాగర్ రూమ్స్‌లో ప్రణీత్ రావు17 కంప్యూటర్లను ఆపరేట్ చేసేవాడు. ఇందు కోసం అనధికారికంగా ఇంటర్నెట్ లేన్స్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్లను కూడా ప్రైవేట్ వ్యక్తులతో ఇన్‌స్టాల్ చేయించాడు. ఇజ్రాయెల్, మలేషియా నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు అవసరమైన డబ్బును ఓ ఎమ్మెల్సీ అందించినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
హార్డ్‌డిస్కుల్లో ఫోన్ ట్యాపింగ్ డేటా
గత ఎనిమిదేండ్లుగా సేకరించిన సీక్రెట్ డేటాను ప్రణీత్ రావు తన వ్యక్తిగత పెన్‌డ్రైవ్స్, ఎక్స్‌టర్నల్ డిస్క్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (ఓఎస్‌డీ),టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తమ పదవులకు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే డిసెంబర్ 4న ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌ను ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌ల స్థానంలో పాత హార్డ్‌డిస్క్‌లను అమర్చాడు.
ఫోన్‌ట్యాపింగ్ ఆధారాలు మాయం చేసేందుకే
ఎస్‌ఐబీ సేకరించిన ఫోన్ నంబర్లు, ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ డేటా ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు లభించకుండా కుట్ర చేశారు. సీక్రెట్ డేటా ఉన్న 9 హార్డ్‌డిస్క్‌లు,5 హార్డ్‌డిస్క్ బాక్స్‌లను ఎలక్ట్రిక్ కట్టర్స్‌తో కట్ చేశారు. వాటిని నాగోల్‌లోని మూసీ నదిలో పడేశారు. ఇదంతా ముందస్తు ప్రణాళికల ప్రకారమే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరం కావడంతో ఆధారాలు లభించకుండా ఉండేందుకే హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు భావిస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు లభించకపోతే కేసు దర్యాప్తు ఎస్‌ఐబీ లాగర్ రూమ్ ధ్వంసంతోనే ఆగిపోతుందని నిందితులైన మాజీ పోలీస్ అధికారులు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పూర్తి సాంకేతిక ఆధారాలు సేకరించేందుకు నిందితులతో పాటు ఎస్‌ఐబీలో విధులు నిర్వహించిన సిబ్బంది, ఆపరేషన్లలో పాల్గొన్న పోలీసుల నుంచి వివరాలు రాబడుతున్నారు.
కొనసాగుతున్న రాధాకిషన్ రావు కస్టడీ
టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ కొనసాగుతున్నది. మూడో రోజు కస్టడీలో భాగంగా బంజారా హిల్స్‌పీఎస్‌లో ఆయనను ప్రశ్నించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఐబీ నుంచి ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం అందించేవాడనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. అయితే, శుక్రవారం కస్టడీలో రాధాకిషన్ రావు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఒత్తిడి తగ్గించారని తెలిసింది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను ముందుంచి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.