వీడుమామూలోడు కాదు..పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ

వీడుమామూలోడు కాదు..పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లిన దొంగ
  •     పట్టుకోవడానికి తిప్పలు పడ్డ పోలీసులు 
  •     చివరకు ఓ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ ​వదిలి తాళాలతో జంప్​
  •     గద్వాల జిల్లా ఇటిక్యాల పీఎస్ ​పరిధిలో ఘటన

గద్వాల, వెలుగు : గద్వాల జిల్లా ఇటిక్యాల పోలీస్​స్టేషన్​పరిధిలో నేషనల్ హైవేపై పెట్రోలింగ్ చేసే పోలీస్ వాహనాన్ని ఎత్తుకువెళ్లాడో దొంగ. తమ వెహికల్ ​మాయమైందని తెలుసుకున్న పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. చివరకు ఆ వాహనాన్ని ఓ పెట్రోల్ ​బంక్ ​దగ్గర వదిలిన దొంగ..తాళాలు మాత్రం పట్టుకెళ్లిపోయాడు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...సోమవారం తెల్లవారుజామున ఇటిక్యాల పోలీసులు ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో వెహికల్స్ డైవర్షన్ చేసేందుకు పెట్రోలింగ్ వాహనంలో వచ్చారు. కిందకు దిగి పక్కన పార్క్ చేసి వెహికల్స్ డైవర్ట్ చేస్తున్నారు.

ఇదే ఛాన్స్​అనుకున్న ఓ దొంగ వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిపోయాడు. దీన్ని అక్కడున్న పోలీసులు ఎవరూ గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న పోలీసులు వాహనం కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. వేరే వాహనంలో తెల్లవారుజామున అలంపూర్ చౌరస్తా దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గరకు వెళ్లారు. అక్కడి సిబ్బందికి వాహన నంబర్ ఇచ్చి కనిపిస్తే చెప్పాలని కోరారు. మరోవైపు పెట్రోలింగ్ వెహికల్ కోసం ముమ్మరంగా గాలించడం మొదలుపెట్టారు. చివరకు కోదండపురం పెట్రోల్ బంక్  సమీపంలో వాహనం ఉందని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూశారు.

కానీ, తాళాలు మాత్రం లేవు. పోలీసులు వెహికల్ ఎత్తుకెళ్లిన వ్యక్తి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వాహనం పార్క్  చేసే టైమ్​లో అందులోనే తాళాలు ఎందుకు ఉంచారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై అలంపూర్ సీఐ రవిబాబును వివరణ కోరగా తాను వేరే డ్యూటీలో ఉన్నానని, పోలీస్​ వెహికల్​ దొంగతనం గురించి తనకు తెలియదన్నారు.