
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని థియేటర్లలో పెంచిన ధరలకే టికెట్లు విక్రయిస్తూ ప్రేక్షకుల నుంచి డబ్బు దండుకుంటున్నారు థియేటర్ యాజమానులు. ఈ క్రమంలో OG సినిమా టికెట్ రేట్లపై థియేటర్ యాజమాన్యాలకు తెలంగాణ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాత రేట్లకే టికెట్లు విక్రయించాలని.. పెంచిన రేటుతో టికెట్లు అమ్మొద్దని హెచ్చరించారు. తక్షణమే టికెట్ రేట్లను తగ్గించాలని ఆదేశించారు. టికెట్ రేట్ల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యాలకు గుర్తు చేశారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ రేట్లకు టికెట్లు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని థియేటర్ యాజమాన్యాలను హెచ్చరించారు పోలీసులు.
కాగా, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓజీ చిత్రం 2025, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. మూవీ యూనిట్ అభ్యర్థన మేరకు తెలంగాణలో ఓజీ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడంతో పాటు, బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఆదేశాలను ఓజీ మూవీ యూనిట్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది.
ఇక్కడ కూడా ఓజీ మూవీ యూనిట్‌కు ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్ల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు టికెట్ రేట్లు తగ్గించాలని ఓజీ థియేటర్ యాజమాన్యాలను పోలీసులు హెచ్చరించారు.