‘మహా’ తిరుగుబాటుకు థాక్రేల వైఖరే కారణమా?

‘మహా’ తిరుగుబాటుకు థాక్రేల వైఖరే కారణమా?

ఒకప్పుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన మరాఠా రాజకీయాలు, నేతలు రాష్ట్రంలో బలమైన సుస్థిరమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో, వాటిని నడపడంలో విఫలమవుతున్నట్లు మరోసారి రుజువైంది. శివసేన పార్టీలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు మహావికాస్ అగాడి ప్రభుత్వం కూలేందుకు కారణమైంది. 2019లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి సొంత మెజార్టీ రాలేదు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బీజేపీ, శివసేన రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ 56 శాసనసభ స్థానాలు మాత్రమే గెలిచిన శివసేన సీఎం పదవి కావాలని కోరడంతో శివసేన మద్దతు లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.

శరద్ పవార్ నడిపిన రాజకీయ మంత్రాంగంతో రాజకీయాల్లో సైద్ధాంతికంగా భిన్న ధ్రువాలైన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అగాడి పేరుతో ఉద్ధవ్ థాక్రే సీఎంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ రెండున్నరేండ్ల పాలనలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను సంతృప్తిపరచడంపైనే దృష్టి పెట్టినఉద్ధవ్ థాక్రే.. సొంత పార్టీలో గూడు కట్టుకున్న అసంతృప్తిని పసిగట్టలేకపోయారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన అనిల్ దేశ్​ముఖ్ అవినీతికి పాల్పడినా, కేబినెట్ సహచరుడు నవాబ్ మాలిక్​ కు ​దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు కలిగి ఉన్నా ఉదాసీనంగా వ్యవహరించిన థాక్రే.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి పొంచి ఉన్న తిరుగుబాటు ముప్పును 
ఊహించలేకపోయారు.

ప్రజలకు, ఎమ్మెల్యేలకు దూరంగా..

శరద్ పవార్ రాజకీయ చాణక్యంతో 2019లో మహా వికాస్ అగాడి ప్రభుత్వం ఏర్పాటైతే, ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రే వైఖరితోనే ప్రభుత్వం కుప్పకూలి పోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తన కనుసైగతో మహారాష్ట్ర రాజకీయాలను, శివసేన పార్టీని నియంత్రించిన బాల్ థాక్రే శివ సైనికులకు నిత్యం అందుబాటులో ఉండేవారు. కానీ ఆ వైఖరికి భిన్నంగా ఉద్ధవ్ థాక్రే పార్టీలో ఎవరికీ అందుబాటులో ఉండలేదు. పైగా ఆదిత్య థాక్రే వ్యవహార శైలితో విసుగు చెందిన, అవమానాల పాలైన నాయకులు థాక్రేపై తిరుగుబాటు చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివసేనకు ఉన్న మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఉద్ధవ్ థాక్రే వ్యతిరేక శిబిరంలో చేరిపోయారంటే  థాక్రేల వ్యవహార శైలిపై వారికి ఏస్థాయిలో అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎంగా థాక్రే ఉన్నా అధికార పెత్తనమంతా శరద్ పవార్ దే అని శివసేన నాయకులు భావించడం, తమ మూల సిద్ధాంతమైన హిందుత్వ జెండాను పక్కన పెట్టడం, తాము రాజకీయంగా విభేదించి పోటీ చేసి ఎవరిపై గెలిచామో ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు కారణాలుగా బయటకొచ్చాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేసిన ఉద్ధవ్ థాక్రే..  చివరకు ప్రభుత్వాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. ఉద్ధవ్ థాక్రే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలిసేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైనా కూడా ఉన్నాయి. పార్టీ నాయకులు, ప్రజలతో సత్సంబంధాలు నెరపలేని ఎంత పెద్ద నాయకులైనా ప్రజాస్వామ్యంలో కనుమరుగవ్వక తప్పదనే దృష్టాంతాలు చరిత్రలో అనేకం ఉన్నాయి.

పైచేయి సాధించిన బీజేపీ

రాజకీయాల్లో ఊహలకందని వ్యూహాలు రూపొందించే బీజేపీ తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండేని సీఎం చేసి ప్రత్యర్థులపై పైచేయి సాధించింది. సీఎం పదవి కోసం గతంలో మహారాష్ట్ర, కర్నాటకల రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యవహరించినట్లు కాకుండా, బిహార్, మహారాష్ట్రల్లో అతిపెద్ద పార్టీగా ఉన్నా, అధికారాన్ని ఇతరులకు వదులుకోవటం ద్వారా బీజేపీకి అధికార దాహం లేదనే విషయాన్ని ఆ పార్టీ చెప్పకనే చెప్పింది. శివసేనకు సానుభూతి రాకుండా చూడటం, ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని బీజేపీ కూల దోసిందనే విమర్శలు రాకుండా జాగ్రత్తపడుతూ.. ఏక్ నాథ్ షిండేని సీఎంగా ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

- డా. తిరునాహరి శేషు
పొలిటికల్ ​ఎనలిస్ట్