ఉద్యమం వల్లే విలీనం ఎజెండా పైకి
సెప్టెంబర్ 17 విలీన దినాన్ని నిర్వహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఈ లొల్లిలో మనం ఒక విషయాన్ని మరిచిపోతున్నాం. భారత దేశంలో తెలంగాణ విలీనం జరిగిన రోజు ఒకటుందని గుర్తు చేసి, దాన్ని రాజకీయ ఎజెండా మీదికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. 1989లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు తరఫున ‘మా తెలంగాణ’ అనే పత్రిక ఆవిష్కరణ తర్వాత తెలంగాణ చరిత్ర, అస్థిత్వంపై చర్చ ప్రారంభమైంది. ఆ చర్చల్లో సెప్టెంబర్ 17 ప్రస్తావన వచ్చేది. మరుగున పడిన చారిత్రక ఘట్టాలపై అధ్యయనం ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన సందర్భం తెలుసుకోకుండా వర్తమాన తెలంగాణ అర్థం కాదని అవగతమైంది. అయితే 1996లో వరంగల్‌లో జరిగిన సమావేశం తర్వాత తెలంగాణవాదం ప్రజల్లోకి వెళ్లింది. తెలంగాణ ఉద్యమం బలపడే క్రమంలో సెప్టెంబర్ 17 ఉత్సవాలకు ప్రాధాన్యం పెరిగింది.
- ప్రొఫెసర్ కోదండ రామ్, అధ్యక్షుడు, తెలంగాణ జనసమితి
నాడు రజాకార్లు, నేడు దొరలు..
అప్పుడు తెలంగాణ రజకార్ల చేతిలో బందీ అయింది. ఇప్పుడు తెలంగాణ కోసం 1,300 మంది అమరులు ప్రాణాలు కోల్పోతే దొరల, గడీల పాలన నడుస్తోంది. కుటుంబ పాలన నుంచి బయటపడినప్పుడే తెలంగాణకు నిజమైన విముక్తి. సెప్టెంబర్ 17న మేము తీసుకుంటున్న రిజొల్యూషన్ కూడా అదే. తెలంగాణ సంపదను ఒక్క కుటుంబమే అనుభవిస్తోంది. బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం రావాలి. నాడు రజాకార్లపై తిరగబడినట్లే.. కుటుంబ పాలనపై తిరగబడే రోజు దగ్గరపడింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
చరిత్ర మరుపే కేసీఆర్ వ్యూహం
సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ విమోచన దినోత్సవమే. అది మనకు ఎమోషన్ లాంటింది. అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఎమోషన్స్ రెచ్చగొట్టడానికే కేసీఆర్ చెప్పారు. తెలంగాణ విమోచనంలో వెలమలు కూడా టార్గెట్‌గా ఉన్నారు. గ్రామాల్లో నిజాంకు తొత్తులుగా వెలమలు, దొరలు పనిచేశారు. చరిత్రను కప్పిపుచ్చడానికి రైతాంగ పోరాటం జరగలేదని, మర్చిపోయే విధంగా చేయడానికి విమోచన దినోత్సవం చేయవద్దంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని వాడుకున్నరు. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ జూన్ 2 ముఖ్యమని అంటున్నరు. జూన్ 2, సెప్టెంబర్ 17 రెండూ సెలబ్రేట్ చేసుకోవాలి. రెండింటిని పోల్చకూడదు.
ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐఏఎస్
చరిత్ర అందరికీ తెల్వాలె
తెలంగాణ విముక్తి పోరాటాన్ని జనానికి వివరించాలి. నిజాంపై బాంబు వేసిన నారాయణ పవార్, వందేమాతరం నినాదంతో చంచల్ గూడ జైల్లో తోటి ఖైదీల్లో స్ఫూర్తి నింపిన రామచంద్రరావు, వ్యూహాలు, ప్రతిదాడులతో పోరాడిన గిరిజన కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, ఆర్య సమాజ్ నేత పండిట్ నరేంద్ర, స్వామి రామానంద తీర్థ.. తమ రచనలు, ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపిన కాళోజీ, దాశరథి, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహనీయుల గురించి నేటి తరానికి చెప్పాలి.
- అప్పాల ప్రసాద్, రాష్ట్ర కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక
పటేల్ ఘనకార్యం కాదు..
కమ్యూనిస్టుల నాయకత్వంలో 1946లోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలైంది. విలీనం అనేది ఒక పొలిటికల్ డిమాండ్. ఆ డిమాండ్ నెరవేరినా భూమికోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం కొనసాగింది. తెలంగాణలో రజాకార్లు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగానే పోరు జరిగింది. ఈ పోరాటంతో నిజాం రాజు వీక్ అయ్యాడు. కమ్యూనిస్టులు బలంగా మారారు. భారత సైన్యం ప్రవేశించిన నాలుగు రోజుల్లోనే రాజు లొంగిపోయాడు. నిజంగా సైనిక చర్య జరిగి నిజాంను ఓడిస్తే జైల్లో పెట్టాలి కదా.. అలా కాకుండా రాజ్ ప్రముఖ్‌గా ఎందుకు సత్కరించింది? నిజాం పాలన అంతమవ్వడంలో పటేల్ ఘనకార్యమేమీ కాదు. కేవలం కమ్యూనిస్టుల పోరాటఫలితమే ఇది.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
స్మారక భవనం నిర్మించాలె
సెప్టెంబర్ 17 తెలంగాణ ఇండియాలో విలీనమైన దినంగానే పరిగణిస్తున్నాం. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నేతృత్వంలోనే జరిగింది. ఐదువేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అంతిమంగా 3వేల గ్రామాలు విముక్తి కాగా, 10లక్షల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారు. నైజాం సర్కారు లొంగిపోయేందుకు కమ్యూనిస్టులే కారణం.ఈ పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి. ఈ పోరాటంలో చనిపోయిన 5వేల మందికి సంబంధించి అమరుల పేర్లను సేకరించి, వారి త్యాగాలను భావితరాలకు తెలుపాలి. వారి పేరున స్మారకభవనాన్ని నిర్మించి, పర్యాటక ప్రాంతంగా మార్చాలి.
కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ముమ్మాటికి విమోచనమే
17 సెప్టెంబర్ ముమ్మాటికి విమోచన దినం. 1925 నుంచే పోరాటం చేసిన ఆర్యసమాజ్ 1938, 1939లో సత్యాగ్రహం చేపట్టింది. ఆ తరువాత స్వాతంత్య్ర పోరాటంగా కార్యరూపం దాల్చింది. రజాకార్లతో పోరాటం చేస్తూ హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనంచేయడానికి వీలు లేదని ఖరాకండిగా చెప్తూ పోరాటం చేసింది. 1948 సెప్టెంబర్ 13న అప్పటి భారత్ ప్రభుత్వ ఉపప్రధాని ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి 17న నిజాం లొంగేటట్లు చేసి లొగిపోయేలా చేయించాడు. పటేల్ నాయకత్వంలో నైజాం భారత్‌లో విలీనమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ పక్కన పట్టి జాతీయ సమైక్యత దినంగా చేస్తోంది. ఇది ముమ్మాటికీ విమోచనమే. ఎంఐఎం ఎప్పుడు జాతీయ సమైక్యతన కోరుకోలేదు.. జిన్నాతో కలిసి పాక్‌లో కలువడానికి ప్రయత్నం చేసింది. నేడు సమైక్యత అనడం విడూడ్డరంగా ఉంది. ప్రభుత్వం మూడున్నర కోట్ల జనాల మనోభావాలను గౌరవించి విమోచన దినోత్సవంగా నిర్వహించాలి.
- విఠల్‌రావు ఆర్యా, ఆర్యసమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు
