రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

రాజకీయ పార్టీలకు రూ. 11, 234 కోట్ల విరాళాలు

దేశంలో రాజకీయ పార్టీలకు 2004 నుంచి 2018 వరకు అక్షరాల రూ. 11, 234 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే ఆర్గనైజేషన్ తెలిపింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద 2599 పార్టీలు రిజిష్టర్ అయి ఉన్నాయి. వాటిలో 8 జాతీయ పార్టీలు, 53 రాష్ట్ర పార్టీలు, మరియు 2538 గుర్తింపులేని పార్టీలు ఉన్నాయి. వీటిలో జాతీయ పార్టీలదే హవా నడుస్తోంది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీంఎంసీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్‌సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు 2004 నుంచి 2018 వరకు రూ. 11, 234 కోట్లు విరాళాలుగా పొందాయంటే వాటి ప్రభావం ఎంతగా ఉందో చెప్పనవసరం లేదు.

గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రూ. 20,000 లోపు వచ్చే విరాళాలకు లెక్క చూపాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ మినహాయింపు ఇచ్చింది. అయితే.. పార్టీలు మాత్రం కోట్లలో విరాళాలు తీసుకుంటూ.. లెక్క చూపడంలేదని ఐటీ శాఖ ఆరోపిస్తుంది.

2014 మరియు 2019లో దేశంలోనే పెద్ద పార్టీగా అవతరించి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ 2018-19 సంవత్సరంలో రూ. 1612 కోట్లు విరాళాలుగా సేకరించింది. జాతీయ పార్టీలన్నీ కలిపి రూ. 2512 కోట్లు విరాళాలుగా పొందాయి. ఈ మొత్తంలో బీజేపీ విరాళాలు 64 శాతంగా ఉన్నాయి.

అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రూ. 728.88 కోట్లు విరాళాలుగా పొందినట్లు ఏడీఆర్ తెలిపింది. పార్టీల మొత్తం విరాళాల శాతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ విరాళాల మొత్తం 29 శాతంగా ఉంది. ఇక 2004 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాంగ్రెస్ మరియు ఎన్‌సీపీలు విరాళాల ద్వారా పొందిన సంయుక్త ఆదాయం 3,902.63 కోట్ల రూపాయలుగా ఏడీఆర్ ప్రకటించింది.

ఐదు మిగిలిన జాతీయ పార్టీలు పొందిన విరాళం రూ. 900.94 కోట్లుగా ఏడీఆర్ తెలిపింది. ఈ మొత్తం విరాళం కంటే బీజేపీ పొందిన విరాళం 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది.

For More News..