
టీఆర్ఎస్
- రాష్ట్రంలో వరుసగా సీఎం పర్యటనలు.. 7న జగిత్యాల టూర్
- ఏదో ఒక స్కీమ్, పనుల పేరుతో నియోజకవర్గాల్లో తిరుగుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- ఖాళీ జాగాలు ఉన్నోళ్లకు ఇండ్ల కోసం 15 రోజుల్లో రూ. 3 లక్షలు
- జనవరి 18 నుంచి కంటి వెలుగు, అదే టైమ్‌లో సెక్రటేరియెట్, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక చిహ్నం ఆవిష్కరణ
బీజేపీ
- అన్ని నియోజకవర్గాల్లో వేగంగా పర్యటించేందుకు బస్సు యాత్ర
- ప్రతి రోజు పాదయాత్రకు ముందు, ఆ తర్వాత జిల్లాలవారీగా సమీక్షిస్తున్న సంజయ్
- లీడర్ల చేరికలను స్పీడప్ చేసిన రాష్ట్ర నాయకత్వం
- ముఖ్య నేతలంతా జనంలో విస్తృతంగా పర్యటించే ప్లాన్
కాంగ్రెస్
- ధరణి పోర్టల్, రైతు సమస్యలపై నిత్యం ఆందోళనలు
- రాహుల్‌గాంధీ పాదయాత్రతో కేడర్‌లో పెరిగిన జోష్‌ను కొనసాగించే పనిలో సీనియర్లు
- అన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచనలు
- అంగబలం, అర్థ బలం ఉన్న నేతలకు టికెట్లు ఇస్తామని సంకేతాలు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తున్నది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం కేసీఆర్ చెప్తూనే.. ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ స్కీములు, పనులన్నింటికీ జనవరి 18 డెడ్‌లైన్ పెట్టి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. డిసెంబర్‌లోనే అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో రేపో మాపో ఎన్నికలు వస్తున్నట్లుగా టీఆర్ఎస్ లీడర్లు హడావుడి చేస్తున్నారు. టీఆర్ఎస్ హంగామా చూసి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల ప్రిపరేషన్ మొదలు పెట్టాయి. ఎన్నికలు తొందరగా వచ్చే అవకాశముందని రాత్రికి రాత్రే బీజేపీ తమ యాక్షన్‌ప్లాన్ మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ వరుసగా రైతుల సమస్యలపై ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల ముచ్చట్నే వినిపిస్తున్నది. నిజానికి వచ్చే ఏడాది డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ఉంది. అంతకు కొద్ది రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఫస్ట్ టర్మ్‌లో ప్రభుత్వానికి ఐదేండ్లు పూర్తికాకముందే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఇప్పుడు ఏడాది ముందు నుంచి కేసీఆర్ చేస్తున్న హడావుడి చూసి.. ముందస్తుకు వెళ్లొచ్చని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధం కావాలని కేడర్‌ను ప్రతిపక్షాలు అలర్ట్ చేస్తున్నాయి.
పాత పనులు ముందటేసుకొని..
సెకండ్టర్మ్లో అధికారం చేపట్టినప్పటి నుంచీ రాజకీయాలకే పెద్దపీట వేసిన కేసీఆర్.. ఇప్పుడు ఉన్నఫళంగా స్కీమ్‌లు, పాత హామీలు, పనులకు సంబంధించిన ఫైళ్లు ముందేసుకున్నారు. ఇటీవల కొత్త సెక్రటేరియెట్, దామరచర్ల పవర్ ప్లాంట్ పనులను పరిశీలించిన ఆయన.. కొత్త కలెక్టరేట్లను ప్రారంభించే పని పెట్టుకొని వరుసగా జిల్లాల టూర్ మొదలుపెట్టారు. నల్గొండ, మహబూబ్‌నగర్ పర్యటనలు పూర్తి చేసుకున్న కేసీఆర్.. ఈ నెల 7న జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం సూచనలతో మంత్రులు, ఎమ్మెల్యేలందరూ సొంత నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఏదో ఒక స్కీమ్, అభివృద్ధి పనులు ముందేసుకొని ఎన్నికలు రాబోతున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వరుసగా స్కీమ్‌లపై రివ్యూ చేస్తున్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికతోపాటు, డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసే ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఖాళీ జాగాలు ఉన్న వాళ్లకు రూ. 3 లక్షలు ఇచ్చే స్కీమ్‌ను అమలు చేస్తామని, పది పదిహేను రోజుల్లోనే నిధులు మంజూరు చేస్తామని ఆదివారం మహబూబ్‌నగర్ పర్యటనలో సీఎం ప్రకటించారు. జనవరి 18 నుంచి కంటి వెలుగు, అదే టైమ్‌లో సెక్రటేరియెట్‌తో పాటు అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించాలని ముహూర్తం పెట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో పనులకు ఈ వారంలోనే పునాదిరాయి వేయనున్నారు. వచ్చే ఏడాది మేలో నిర్వహించే గ్రూప్- 4 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మునుగోడుకు వెళ్లి హామీల పురోగతిని అప్పజెప్పడంటో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆకట్టుకునే హామీల వరద గుప్పిస్తున్నారు.
ఎక్కడికక్కడ ఆందోళనలకు కాంగ్రెస్ రెడీ
టీఆర్‌ఎస్, బీజేపీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా ఎలక్షన్ మూడ్‌లోకి వచ్చారు. ధరణి పోర్టల్, రైతు సమస్యలపై ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. వికారాబాద్‌లో సోమవారం చేపట్టిన కాంగ్రెస్ ఆందోళనకు పార్టీ కేడర్‌తో పాటు రైతులు, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇటీవల ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్తుండటంతో ఆ ప్రభావం పార్టీపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ఎత్తుగడలు వేస్తున్నారు. వరంగల్ రైతు గర్జన సభ, రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పాదయాత్రతో కేడర్‌లో పెరిగిన జోష్‌ను కొనసాగించేందుకు రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలను ప్రోత్సహిస్తూ ప్రజల్లోకి వెళ్లి పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. అంగబలం, అర్థ బలం ఉన్న నేతలకు పార్టీ అభ్యర్థులుగా అవకాశమిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. గ్రామాలు, బూత్‌ల వారీగా పార్టీ కేడర్‌ను గుర్తించి వారిని యాక్టివేట్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
నియోజకవర్గాలన్నీ చుట్టేసేలా బీజేపీ బస్సు యాత్ర
టీఆర్ఎస్ హడావుడి చేస్తుండటంతో.. బీజేపీ రూట్ మార్చుకుంది. ఆదిలాబాద్జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను బస్సు యాత్రగా మార్చాలని డిసైడయ్యారు. ఎన్నికలు వచ్చేలోగా అన్ని నియోజకవర్గాలను చుట్టేయాలంటే.. పాదయాత్రతో అందుకోలేమని బస్సు యాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పార్టీ క్యాడర్‌ను ముందస్తు మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సంజయ్ ప్రతి రోజు పాదయాత్రకు ముందు, ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్‌లతో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తున్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో సమీక్ష చేసిన ఆయన.. మంగళవారం నిజామాబాద్, బుధవారం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలతో రివ్యూ చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీలో బలమైన నాయకులను గుర్తించి.. రాబోయే ఎన్నికల్లో టికెట్ వచ్చే అవకాశమున్న నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నియోజకవర్గంలో వారిని విస్తృతంగా తిరగాలనే సంకేతాలు ఇచ్చే పనిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. నేతల జాయినింగ్స్స్పీడప్ చేయాలని చూస్తున్నది. పార్టీ ముఖ్య నేతలంతా విస్తృతంగా జనంలో పర్యటించేందుకు ప్లాన్చేస్తున్నది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మూడు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. బస్తీల్లో జనం సమస్యలు తెలుసుకుంటున్నారు.
పాదయాత్రల్లో బీఎస్పీ, వైఎస్సార్టీపీ
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే పాదయాత్ర చేస్తున్నారు. కొత్త ఏడాదిలో పార్టీ యాక్టివిటీస్‌ను మరింత విస్తృతం చేయాలనే యోచనలో ఆయన ఉన్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు నల్గొండలో బ్రేక్ పడింది. రెండు, మూడు రోజుల్లో ఆమె తిరిగి యాత్ర ప్రారంభించే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో కమ్యూనిస్టులు జట్టుకట్టే అవకాశముంది. ఆ పార్టీలు పలు ఆందోళనల పేరుతో ప్రజల మధ్యే ఉంటున్నాయి. రాష్ట్రంలోని మిగతా పార్టీలు నిత్యం ప్రజల్లో ఉండేందుకు పలు ఆందోళనలు, నిరసనలకు ప్లాన్ చేసుకుంటున్నాయి.