మా పార్టీలోకి రండి..గ్రేటర్ లో మారుతున్న పొలిటికల్ సీన్

మా పార్టీలోకి రండి..గ్రేటర్ లో మారుతున్న పొలిటికల్ సీన్
  • బీఆర్ఎస్​అసంతృప్తులకు కాంగ్రెస్​గాలం
  • ఎమ్మెల్యే మైనంపల్లి చేరికతో జోరు పెంచిన హస్తం నేతలు  
  • టికెట్ రాని ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి లీడర్లతోనూ చర్చలు 
  • కాంగ్రెస్​లో చేరాలంటూ గులాబీ నేతలతో సంప్రదింపులు

హైదరాబాద్, వెలుగు : త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ రానుండ గా.. గ్రేటర్​ హైదరాబాద్​లో పొలిటికల్ సీన్ మారుతుంది. బీఆర్ఎస్ ​అసంతృప్తులకు కాంగ్రెస్​గాలం వేస్తుంది. గులాబీ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇప్పటికే మల్కాజిగిరి బీఆర్ఎస్​ ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు, తన మద్దతుదారులతో కాంగ్రెస్​లో చేరారు.

దీంతో మరికొందరు సిట్టింగ్ టికెట్ దక్కని గులాబీ ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలను సైతం హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే వారితో  కొందరు కాంగ్రెస్ ​ముఖ్యనేతలు సంప్రదింపులు చేస్తున్నారు. బీఆర్ఎస్​నుంచి పెద్దసంఖ్యలో చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో గ్రేటర్ లో అధిక సీట్లను గెలుచుకోవాలని కాంగ్రెస్​ నేతలు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

మైనంపల్లి బాటలో ఇంకొందరు..

కాంగ్రెస్​ ఇచ్చే ఆఫర్లకు కొందరు బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా స్పందిస్తున్నట్టు సమాచారం. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్​లో చేరి తను కోరుకున్నట్టుగా రెండు సీట్లను ఇచ్చేలా హామీ​పొందారు. తాజాగా ఆయన బాటలోనే మరికొందరు గులాబీ ప్రజా ప్రతినిధులు కూడా హస్తం గూటికి చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తుంది. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాశ్​రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకుండా బండారు లక్ష్మారెడ్డిని అధిష్టానం ప్రకటించింది. దీంతో సుభాశ్​రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉండగా.. తమ పార్టీలోకి రావాల్సిందిగా ఇప్పటికే కాంగ్రెస్​నేతలు ఆయనకు సంకేతాలు ఇచ్చారు. ఆయన కూడా చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం.

కుత్బుల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్​ఎమ్మెల్యే వివేకానందకు టికెట్​ఖరారైంది. దీంతో అదే సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్​రాజుతో మనస్పర్థలు వచ్చాయి. మరోవైపు నియోజకవర్గంలోని కొందరు గులాబీ సీనియర్లు వివేకానందను వ్యతిరేకిస్తున్నారు. దీంతో రాజును కూడా కొందరు కాంగ్రెస్​ముఖ్యనేతలు సంప్రదించినట్టు తెలిపింది. అంబర్​పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​కు ఈసారి టికెట్​ఇవ్వొద్దంటూ సెగ్మెంట్ కు చెందిన పలువురు పార్టీ సీనియర్​నేతలు అసమ్మతి వ్యక్తం చేశారు. అయినా కేసీఆర్ ఆయననే ప్రకటించడంతో చాలామంది ద్వితీయశ్రేణి గులాబీ నేతలు కార్యకర్తలు కాలేరుపై తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్​ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

బీఆర్ఎస్ ​నేత, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్​ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా కాంగ్రెస్​లో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ముషీరాబాద్​ సిట్టింగ్​ఎమ్మెల్యే ముఠా గోపాల్​పై పార్టీ నేతల అసంతృప్తి సెగలు తగ్గడంలేదు. నియోజకవర్గంలోని సీనియర్​ నేత ఎంఎన్​ శ్రీనివాస్​ చాలాకాలంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆయన టీడీపీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ ​నేతల పిలుపు మేరకు పార్టీలో చేరారు. కానీ ఇప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది.

దీంతో హస్తం నేతలు ఆయనను కూడా పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. గోషామహల్​నుంచి బీజేపీ తరపున పోటీచేయాలని ప్రయత్నిస్తున్న దివంగత మాజీ మంత్రి ముఖేశ్​ గౌడ్​ కొడుకు విక్రమ్​గౌడ్​ను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. ఇలా సిటీలోని ప్రధాన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ అసంతృప్తు నేతలను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్​ నేతలు తీవ్ర  ప్రయత్నాలే చేస్తున్నారు. 

అధిక సీట్లే లక్ష్యంగా.. 

గ్రేటర్​లో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్​నేతలు ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్​ నుంచి టికెట్ ఆశించి  భంగపడ్డ నేతలను, నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కీలకమైన ఖైరతాబాద్, ముషీరాబాద్,  సికింద్రాబాద్, అంబర్​పేట, సనత్​నగర్, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్​బీ నగర్​వంటి చోట్ల పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

పాతబస్తీలోనూ జెండా ఎగుర వేసేందుకు, ప్రత్యర్థి పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్​ నేత చెప్పారు. అందుకే ఆకర్ష్​ మంత్రాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈసారి కాంగ్రెస్​కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అధికారంలోకి తామే రానున్నామన్న ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.