ముందస్తు ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీ 

ముందస్తు ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీ 
  • హాథ్​ సే హాథ్​​ జోడో పేరుతో భట్టి విక్రమార్క టూర్
  • గుడ్ మార్నింగ్ మధిర పేరుతో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్
  • వాడవాడకు పువ్వాడ పేరుతో మంత్రి అజయ్ పర్యటన

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో అప్పుడే ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది. కొద్ది నెలల్లోనే ఎలక్షన్లు ఉంటాయన్న అంచనాలతో లీడర్లు అందుకు తగిన విధంగా ప్లాన్ ​చేసుకుంటున్నారు. వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల పేర్లతో ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. వాళ్ల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజ్​ వారి సొంత నియోజకవర్గాల్లో కాలినడకన పర్యటిస్తున్నారు. త్వరలోనే మరికొందరు ప్రజాప్రతినిధులు, మాజీ నేతలు కూడా ఇదే తరహాలో యాత్రలకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ పొలిటికల్ టూర్లు ఎవరికి కలిసొస్తాయనే అంశంపై ప్రజల్లో చర్చ మొదలైంది.

వాడవాడకు పువ్వాడ

ఖమ్మం కార్పొరేషన్​లో ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజునే ‘వాడ వాడ పువ్వాడ’ పేరుతో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటనలు మొదలుపెట్టారు. ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తుండడంతో ఆయన వెంట స్థానిక కార్పొరేటర్లతో పాటు, బీఆర్ఎస్​లీడర్లు, మున్సిపల్ కార్పొరేషన్​అధికారులు పాల్గొంటున్నారు. ఉదయాన్నే ఆయా డివిజన్లలో పర్యటిస్తూ, స్థానికుల సమస్యలను తెలుసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, పెన్షన్​ ఇబ్బందులు ఎవరైనా మంత్రికి చెప్పుకుంటే, వాటికి పరిష్కార మార్గాలను ఆయన సూచిస్తున్నారు. డివిజన్లలో బహిరంగ సభలు పెడుతూ.. ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చెబుతూ, రాజకీయ విమర్శలను కూడా ఎక్కుపెడుతున్నారు. ​నగరంలోని 60 డివిజన్లలో పూర్తయిన తర్వాత రఘునాథపాలెం మండలంలో పర్యటించాలని అజయ్​ భావిస్తున్నారు. దీన్ని బట్టి ముందుగానే ఎన్నికలకు అజయ్​ శంఖారావం మోగించినట్టుగా ఆయన అనుచరులు కామెంట్ చేస్తున్నారు. 

మధిరలో భట్టి వర్సెస్​ లింగాల

హ్యాట్రిక్​ విజయాలు సాధించిన మధిర నియోజకవర్గంలో మరోసారి గెలవాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భావిస్తున్నారు. గతేడాది ఆయన నియోజకవర్గంలో 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు యాత్ర చేస్తున్నానని అప్పట్లో చెప్పుకొన్నారు. తాజాగా మళ్లీ ‘హాథ్​ సే హాథ్​ జోడో’ పేరుతో మళ్లీ భట్టి విక్రమార్క పాదయాత్రను ఎర్రుపాలెం మండలం నుంచి మొదలుపెట్టారు. ముందుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భట్టి యాత్ర ఉంటుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో జిల్లా పరిషత్​చైర్మన్​లింగాల కమల్ రాజు కూడా మధిరలోని వార్డుల్లో పర్యటనలు మొదలుపెట్టారు. ‘గుడ్ మార్నింగ్ మధిర’ పేరుతో వార్డుల్లో తిరుగుతున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్​ మీటింగ్ లో మధిర మున్సిపాలిటీకి రూ.30 కోట్ల నిధులను సీఎం కేసీఆర్​ ప్రకటించడంతో అందుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు, ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నానని చెబుతున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో మధిర నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత జడ్పీటీసీగా గెలిచి, జడ్పీ చైర్మన్​ గా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కమల్ రాజు భావిస్తున్నారు. అందుకే ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ఈ మార్గాన్ని ఆయన ఎంచుకున్నారని కమల్ రాజు అనుచరులు చెబుతున్నారు. 

మాజీలదీ అదే దారి

ప్రస్తుతం ప్రజా ప్రతినిధులంతా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ పేరుతో కొందరు, వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం పేరుతో మరికొందరు రెగ్యులర్ గా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఫంక్షన్లకు, పెళ్లిల్లకు, చనిపోయిన వారి కుటుంబాల పరామర్శలకు అటెండ్ అవుతున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కూడా త్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పాలేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా మరోసారి పాదయాత్ర, పర్యటనలు చేస్తారని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు.