యువతకు జాబ్స్ ఆలోచన లేదు.. బాలీవుడ్ కేసులతో బిజీ

యువతకు జాబ్స్ ఆలోచన లేదు.. బాలీవుడ్ కేసులతో బిజీ

ప్రముఖ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా దెబ్బకు ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీనిపై ప్రముఖ రచయిత, కాలమిస్ట్ చేతన్ భగత్ స్పందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ప్రజలు స్పందించకపోతే దేశం మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. బాలీవుడ్ కేసుల పరిష్కారంలో యువత బిజీగా ఉన్నారని, వారు ఎకానమీ గురించి పట్టించుకునే స్థితిలో లేరన్నారు. కఠినమైన లాక్‌డౌన్ దేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దీని వల్ల ఉద్యోగాలు పోయాయని, మిడిల్, లోవర్ ఇన్‌‌కమ్ వాళ్లు ఎక్కువగా ఉన్న మన దేశంలో లాక్‌‌డౌన్ సరికాదన్నారు. దీన్ని ప్రజలు భరించలేకపోయారని పేర్కొన్నారు.

‘ఎకానమీ గురించి ప్రజలు పట్టించుకోరని తెలిసిన ప్రభుత్వాలు సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి సమయాన్ని కేటాయించవు. ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలే పట్టించుకోనప్పుడు రాజకీయ నాయకులు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్లు (యువతను ఉద్దేశించి) బాలీవుడ్ కేసులను పరిష్కరిస్తూ ఉండాలా లేదా తమకు జాబ్స్ ఎలా వస్తాయోనంటూ ఆలోచిస్తుండాలా? ప్రస్తుత పరిస్థితుల్లో దేశ యువత తమ చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని పట్టించుకోవడం లేదు’ అని చేతన్ వివరించారు.