యూరియాపై రాజకీయం తగదు.. కేంద్రం జాప్యం వల్లే తాత్కాలిక కొరత.. మంత్రులు పొంగులేటి, దామోదర

యూరియాపై రాజకీయం తగదు.. కేంద్రం జాప్యం వల్లే తాత్కాలిక కొరత.. మంత్రులు పొంగులేటి, దామోదర

మహబూబాబాద్, వెలుగు : యూరియా సమస్యలపై బీఆర్ఎస్‌‌‌‌ రాజకీయం చేయడం తగదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి అన్నారు. రాష్ట్ర కోటాను కేంద్రం సరైన సమయంలో అందించకపోవడం వల్లే తాత్కాలికంగా కొరత ఏర్పడిందన్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖతో మంగళవారం (సెప్టెంబర్ 03) మహబూబాబాద్‌‌‌‌లో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్‌‌‌‌ కాలేజీలు, క్రిటికల్‌‌‌‌ కేర్‌‌‌‌ బ్లాక్‌‌‌‌, హాస్టల్‌‌‌‌ బిల్డింగ్స్‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటా కోసం మంత్రుల టీమ్‌‌‌‌ ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. యూరియా కోసం రైతులెవరూ ఆందోళన చెందొద్దని, మరో రెండు రోజుల్లో మానుకోట జిల్లాకు 18 టన్నుల యూరియా రానుందని ప్రకటించారు.

ఆరోగ్య తెలంగాణగా మారుస్తాం :  దామోదర రాజనర్సింహ

రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. మంగళవారం పలువురు మెడికల్‌‌‌‌ స్టూడెంట్లతో మాట్లాడి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందన్నారు. అవయవ మార్పిడి సర్జరీలు జిల్లా హాస్పిటల్స్‌‌‌‌లోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహబూబాబాద్‌‌‌‌లో క్యాన్సర్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హడావుడిగా మెడికల్‌‌‌‌ కాలేజీలు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. మౌలిక వసతులు మాత్రం కల్పించలేకపోయిందన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్‌‌‌‌రెడ్డి, మహబూబాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌‌‌‌, పీసీసీ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కలెక్టర్ అద్వైత్‌‌‌‌కుమార్‌‌‌‌సింగ్‌‌‌‌, ఎస్పీ సుధీర్ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌, డీఎంఈ డాక్టర్‌‌‌‌ కె. నరేంద్రకుమార్, మెడికల్‌‌‌‌ కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌ లకావత్‌‌‌‌ వెంకట్‌‌‌‌, ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ పాల్గొన్నారు. 

సీజనల్‌‌‌‌ వ్యాధులపై అలర్ట్‌‌‌‌గా ఉండాలి

జనగామ, వెలుగు : జనగామలోని సర్కార్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో కొత్తగా ఏర్పాటుచేసిన సిటీ స్కాన్‌‌‌‌ సేవలను మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్‌‌‌‌లోని వార్డులను సందర్శించి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ బాషా షేక్​, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ కొమ్మూరి ప్రతాప్‌‌‌‌రెడ్డి, పాలకుర్తి నియోజవవర్గ ఇన్‌‌‌‌చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు.