అన్నా.. వచ్చి ఓటేసిపోండి .. వలస ఓటర్లకు పార్టీల పిలుపు

అన్నా.. వచ్చి ఓటేసిపోండి .. వలస ఓటర్లకు పార్టీల పిలుపు
  • రానుపోనూ ఖర్చులు పెట్టుకుంటామనే భరోసా 
  • అవసరమైతే ప్రత్యేక వాహనాలు పెట్టేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థులు పోల్ మేనేజ్​మెంట్ పై దృష్టిసారించారు. ఇప్పటివరకు సెగ్మెంట్ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం నిర్వహించిన నేతలు.. ప్రస్తుతం ఆ సెగ్మెంట్ కు చెంది ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టారు. పోలింగ్ రోజు వచ్చి నేతలు ఓటేసి పోవాలని ఫోన్లు మొదలుపెట్టారు. ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అభ్యర్థులు ప్రతి ఓటునూ కీలకంగానే భావిస్తున్నారు. 

హైదరాబాద్​లో ఎక్కువ ఓటర్లు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండి.. ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్ సిటీలోనే లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల లీడర్లు.. పలు నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్ల వివరాలు సేకరించారు. 

ప్రస్తుతం వారందరినీ ప్రసన్నం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయా పార్టీల నేతలు వారికి ఫోన్లు చేసి ఓటు వేసేందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటే.. ప్రత్యేకంగా వాహనాలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 

హైదరాబాద్​ సిటీలో ఒకే ఊరుకు చెందిన వాళ్లు ఐదారుగురు ఉంటే వారికి కార్లు పెట్టి, గ్రామాలకు తరలించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర ప్రాంతాల్లో ఉండి, సొంతంగా ఓటు వేసేందుకు వచ్చే వారు ఎవరైనా ఉంటే.. వారికి రానుపోను చార్జీలు లెక్కగట్టి దానిపై కొంత ఎక్కువ ఇస్తామని హామీలు ఇస్తున్నారు. కొందరికి గూగుల్ పే/ ఫోన్ పే ద్వారా చెల్లించేందుకు రెడీ అయ్యారు. కొందరికి రైళ్లు, బస్సుల్లో సీట్లు రిజర్వుచేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఊరికి కనీసం 50 నుంచి100 ఓట్లు..

పట్టణాలు, గ్రామాల్లో ఓటు ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉండే వారు మెజార్టీ గ్రామాల్లో కనీసం 50 నుంచి వంద మంది వరకు ఉంటున్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. తీవ్ర పోటీ ఉండటంతో ఈ ఓట్లు కీలకం అని నేతలు భావిస్తున్నారు. దీంతో వారందరినీ గ్రామాలకు 
రప్పించేందుకు వారితో మాట్లాడుతున్నారు. 

పేరెంట్స్, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడిస్తున్నారు. రానుపోను ఖర్చులు పెట్టుకుంటామని, దావత్ కూడా ఇస్తామని, తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. అయితే 30న పోలింగ్ డే రోజున హాలీడే ఉండటంతో, వారంతా ఓటు వేసేందుకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తున్నది.