
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదలపై ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన వెంటనే కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడాన్ని తప్పుబట్టారు. ధరల పెరుగుదలపై బుధవారం లోక్ సభలో మాట్లాడిన సుప్రియా.. ప్రతి నెలా ఎన్నికలుంటే పెట్రో ధరలు ఎప్పటికీ పెరగవని కేంద్రానికి చురకలంటించారు. ధరల పెరుగుదల కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను జీరో అవర్ సందర్భంగా సుప్రియా సూలే సభలో ప్రస్తావించారు. ఉజ్వల పథకం కింద మహిళలకు ఉచితంగా సిలిండర్లు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం.. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ధరలతో వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ సైతం ధరల పెరుగుదలపై మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరుగుతోందన్న సాకు చూపి ధరలు పెంచుతున్న ప్రభుత్వం.. ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచుతోందని అధిర్ రంజన్ విమర్శించారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్ ధరల ఎంత పెరిగినా దాని ప్రభావం సామాన్యుడిపై పడకుండా చూసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.