ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్.. నల్లగా మారిపోతున్న ఎర్రకోట.. సౌందర్యంతో పాటు పటిష్టతపై ప్రభావం

ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్.. నల్లగా మారిపోతున్న ఎర్రకోట.. సౌందర్యంతో పాటు పటిష్టతపై  ప్రభావం
  • గోడలపై పొరలుగా  పేరుకుపోయిన ధూళి కణాలు 
  • లేయర్లలో జిప్సం, క్వార్ట్జ్‌‌, సీసం, రాగి, జింక్ లాంటి డేంజర్ లోహాలు
  • సౌందర్యాన్ని కోల్పోవడంతోపాటు పటిష్టతపై తీవ్ర ప్రభావం
  • ఇండో-ఇటాలియన్ శాస్త్రవేత్తల బృందం స్టడీలో వెల్లడి
  • మెయింటెనెన్స్, కాలుష్యాన్ని అరికట్టడం లాంటి చర్యలు చేపట్టాలని సూచన

న్యూఢిల్లీ: మొఘల్ సామ్రాజ్య గొప్పతనానికి చిహ్నం, దేశానికే తలమానికైన ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట( రెడ్ ఫోర్ట్ ) ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఢిల్లీలోని తీవ్ర వాయు కాలుష్యం వల్ల 17వ శతాబ్దానికి చెందిన ఎర్రకోట..తన ఎరుపు రంగును కోల్పోతున్నదని ఇండో~ఇటాలియన్ సైంటిస్టుల బృందం 2021 నుంచి 2023 వరకు నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. గోడలపై 55- నుంచి 500 మైక్రోమీటర్ల( మన వెంట్రుకంత) మందం రసాయన పొరలు పేరుకుపోయాయని తెలిపింది. దీనివల్ల ఎర్రకోట క్రమక్రమంగా నల్ల రంగులోకి మారుతున్నదని వివరించింది. విష వాయువుల వల్ల రెడ్ ఫోర్ట్ తన సహజ సౌందర్యాన్ని కోల్పోవడంతోపాటు దాని పటిష్టత, స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ కూడా తీవ్రంగా దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయన వివరాలు జూన్ 2025లో 'హెరిటేజ్' జర్నల్‌‌లో ప్రచురితమయ్యాయి. 

ఎర్రకోట గోడలను దెబ్బతీస్తున్న విషపూరిత గాలి..

స్టడీ ప్రకారం..ఢిల్లీలోని విషపూరిత గాలి ఎర్రకోట రాతి గోడలను దెబ్బతీస్తున్నది. వాహనాల నుంచి వెలువడే పొగ, సిమెంట్ కర్మాగారాలు, ఇతర పరిశ్రమలు, నిర్మాణ రంగం నుంచి వెలువడే ధూళి కణాలు గాలితో కలిసి కోట గోడలపై పొరలుగా పేరుకుపోతున్నాయి. దీనివల్ల కోట రాతి గోడలపై క్రమక్రమంగా 'బ్లాక్ క్రస్ట్స్ (నల్లటి గట్టి పొరలు)' ఏర్పడుతున్నాయి. ఈ పొరల్లో జిప్సం, క్వార్ట్జ్‌‌, సీసం, రాగి, జింక్ వంటి ప్రమాదకరమైన భార లోహాలు ఉన్నాయి. ప్రధానంగా వెహికల్స్ నుంచి వెలువడే పొగ ద్వారా కూడా  టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, రాగి, జింక్, బేరియం వంటి భారీ లోహాలు గాలిలోకి విడుదల అవుతున్నాయి. ఈ లోహాలన్ని గాలితో కలిసిపోయి ఎర్రకోట పరిస్థితిని దిగజారుస్తున్నాయని స్టడీ తేల్చి చెప్పింది. 

ఇలాగే వదిలేస్తే కనుమరుగే..

విషవాయువులతో దెబ్బతింటున్న ఎర్రకోటను ఇప్పటికైనా పట్టించుకోకుంటే ఆ చారిత్రక కట్టడం కనుమరుగవ్వడం ఖాయమని స్టడీ స్పష్టం చేసింది. ముందుగా 55-~500 మైక్రోమీటర్లు మందం కలిగిన కెమికల్స్ పొరల ప్రభావం వల్ల గోడలపై ఉన్న సున్నితమైన, అపురూపమైన శిల్పకళ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్రకోటకే కాకుండా ఢిల్లీలోని హుమాయున్ సమాధి వంటి ఇతర చారిత్రక కట్టడాలకు కూడా భవిష్యత్తులో ఇదే ముప్పు పొంచి ఉందని అధ్యయనం పేర్కొంది.

పరిష్కార మార్గాలివే..

అయితే, సైటింస్టులు ఈ సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎర్రకోట రాతి గోడలపై నల్లటి పొరలు ఏర్పడటం ప్రారంభ దశలో ఉన్నప్పుడే వాటిని తొలగించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో తరచూ శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టడం, రాళ్లకు రక్షణ పూతలు వేయడం ద్వారా ఈ చారిత్రక సంపదను కాపాడుకోవచ్చని చెప్పారు. ఢిల్లీలో  కాలుష్య నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని..ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని వేగంగా తగ్గించి ఎర్రకోటను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.