- ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల సమావేశం
ఖమ్మం రూరల్ , వెలుగు : ‘వార్డుల్లోకి వెళ్లండి.. జనం సమస్యలను గుండెలకు హత్తుకోండి.. పరిష్కరిస్తామని హామీ ఇవ్వండి.. వాటిని నెరవేర్చే బాధ్యత నాది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏదులాపురం అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో 32 వార్డుల అభ్యర్థులు, ఇన్-చార్జులతో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా సమావేశం నిర్వహించిన మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే, ఏదులాపురం రూపురేఖలను మారుస్తానని చెప్పారు.
అభివృద్ధిలో ఏదులాపురాన్ని రాష్ట్రానికే ఒక దిక్సూచిగా, ఆదర్శ మున్సిపాలిటీగా నిలబెట్టే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఏదులాపురాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతి వార్డులోనూ తాను స్వయంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ, దూకుడుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వార్డు, జోనల్ ఇన్-చార్జులు, అభ్యర్థులు సమన్వయంతో ప్రతీ ఓటరును కలిసి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలను వివరిస్తూనే, అభివృద్ధి పట్ల వారికున్న నిబద్ధతను
చాటి చెప్పాలన్నారు.
