
నల్గొండ, వెలుగు : బీఆర్ఎస్ మాజీ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని నక్కల గండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొంగులేటితో పాటు, మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కూడా పార్టీలో చేరతారన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ గురించి ప్రశ్నించగా బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ వలసలు ఉంటాయన్నారు. హైదరాబాద్సంస్థానం ఏర్పాటు నాటికి తెలంగాణలో 15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 2004 నాటికి మరో 35 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. 2014 సంవత్సరానికి ముందే రాష్ట్రంలో 95 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఐదు లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి రూ.5లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందన్నారు. కాళేశ్వరంతో కరెంట్బిల్లు నష్టం తప్పా రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఈఎన్సీని పోనివ్వకుండా..సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు.
పోలీస్ వ్యవస్థపై సీఎంకు లెటర్
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అస్తవ్యవ్థమైందంటూ భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. ఆ లెటర్‌ను నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం దగ్గర రిలీజ్చేశారు. తన పాదయాత్రలో పోలీసుల వేధింపుల గురించి జనాలు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. పోలీసు వ్యవస్థ బీఆర్ఎస్పార్టీకి ప్రైవేటు సైన్యంగా మారిందన్నారు.
కలెక్టర్లు, ఎస్పీలు గులాబీ షర్ట్ వేసుకోవడం ఒక్కటే తక్కువ
బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు గులాబీ షర్ట్ ఒక్కటే వేసుకోవడం లేదని, పూర్తిగా ఆ పార్టీకి తొత్తులుగా మారారని పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో గులాబీ తొత్తులుగా మారిన అధికారుల లెక్కలు బయటపెడతామని, కచ్చితంగా వారిపై చర్యలుంటాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్నారు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించకుండా 9 ఏండ్లుగా కేసీఆర్ కాలయాపన చేస్తున్నాడన్నారు.