ప్రతి నెలా ఫస్టుకే జీతాలివ్వండి: పొన్నం ప్రభాకర్

ప్రతి నెలా ఫస్టుకే జీతాలివ్వండి: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: ప్రతి నెలా ఒకటో తారీఖున ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రవాణా, బీసీ సంక్షేమ శాఖలపై  బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం  జరిగింది. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్,  స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపుల్లో రవాణా, బీసీ శాఖలకు ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతుందని.. రోజుకు 27 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని వెల్లడించారు. ఈ పథకం వల్ల ఆదాయం తగ్గి ఖర్చు పెరుగుతుందని తెలిపారు. అదనంగా  కొత్త బస్సుల కొనుగోలుకు సహాయం చేయాలని కోరారు. బ్యాంకు లోన్ లు , కొత్త నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బాండ్లు, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు దృష్టి సారించాలని కోరారు. ప్రతి నెలా ఫస్టుకే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడేలా చూడాలని.. మహాలక్ష్మి విజయవంతానికి సహకరించాలని సూచించారు.