హుస్నాబాద్, వెలుగు: సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీసీ సంక్షేమ మంత్రిగా తాను, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్, మైనార్టీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీన్ ఉన్నారని, ఆయా శాఖల మంత్రుల గురించి హరీశ్ రావు చలకనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సంక్షేమ శాఖల నిర్ణయాధికారాలన్నీ ప్రిన్సిపాల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్‌కే ఇచ్చామని, తాము ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. అవగాహన లేకుండా మాట్లాడి తన స్థాయిని తగ్గించుకోవద్దని హరీశ్‌కు సూచించారు. గత ప్రభుత్వ పదేండ్ల కాలంలో జరిగినట్లే, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుందనే భావనలో ఆయన ఉన్నారని, తమ ప్రభుత్వం పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నదని పేర్కొన్నారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై బీఎల్ఏల ట్రైనింగ్ అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉన్న చోట్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బిహార్, వెస్ట్‌బెంగాల్, తమిళనాడులో లక్షలాది ఓట్లను తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ఓట్లను కాపాడాలని సూచించారు.
మరోవైపు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాలపై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం వాహనదారులతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.
