పారిశుధ్య కార్మికులే నిజమైన దేవుళ్లు

పారిశుధ్య కార్మికులే నిజమైన దేవుళ్లు

హుస్నాబాద్, వెలుగు: ఆరోగ్యాలు పణంగా పెట్టి చెత్తాచెదారాన్ని తొలగిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న పారిశుధ్య కార్మికులు నిజమైన దేవుళ్లని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఆయన గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న 111 మంది పారిశుధ్య కార్మికులకు కొత్త బట్టలు పెట్టి, శాలువాలతో సన్మానించారు. వారిని గౌరవంగా కుర్చీల్లో కూర్చోబెట్టి ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కింద కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 మురుగుకాల్వలు, రోడ్లు శుభ్రం చేస్తూ ప్రజలను రోగాలబారిన పడకుండా చూస్తున్న కార్మికులే నిజమైన ప్రాణదాతలన్నారు. కార్మికులు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం సేఫ్టీ గ్లౌజులు, బూట్లు అందజేస్తున్నదని తెలిపారు. వారి ఆరోగ్యం కూడా తమకు ముఖ్యమన్నారు. జాతీయ స్థాయిలో హుస్నాబాద్ మున్సిపాలిటీకి మూడు సార్లు స్వచ్ఛత అవార్డులు రావడానికి కార్మికుల కృషి ఉందన్నారు. అనంతరం ఆయన గాంధీజీ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, శాంతి, అహింసలే ఆయుధాలుగా చరిత్రపై చెరగని ముద్ర వేసిన గాంధీ స్ఫూర్తితో అందరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.