ప్రధాని మోదీ.. నల్ల ధనాన్ని ప్రోత్సహిస్తున్నారు: మంత్రి పొన్నం

ప్రధాని మోదీ..  నల్ల ధనాన్ని ప్రోత్సహిస్తున్నారు: మంత్రి పొన్నం

హన్మకొండ: రాజకీయ లబ్ధి కోసం క్రిబ్ కో క్రింద నల్లధనాన్ని వేల కోట్ల రూపాయల విరాళాలు సేకరించి రాజకీయం చేస్తున్నారని బీజేపీపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో విరాళాలు సేకరించవచ్చని మోదీ స్వయంగా చెప్పారన్నారు. నల్ల ధనాన్ని మోదీ..  ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.

ఏప్రిల్ 17వ తేదీ బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట గ్రామంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడి లాంటి పాలన దక్షత ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం బీజేపీ పార్టీ వేల కోట్ల రూపాయల బాండ్లు తీసుకున్నారని విమర్శించారు.

శరత్ చంద్ర రెడ్డి అనే వ్యక్తి రూ.500 కోట్ల విరాళాలు ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందని మంత్రి పొన్నం అన్నారు. మరొక వ్యక్తి రూ.100 కోట్లు ఇచ్చిండని.. అంటే ఆయనకు కాంట్రాక్టు వచ్చిందని చెప్పారు. ఈ విధంగా బీజేపీ వేల కోట్ల రూపాయలు రాజకీయ లబ్ధి కోసం విరాళాలు సేకరించిందన్నారు.దీనిపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి బాగోతం బయటపెట్టిందన్నారు. నల్లడబ్బు వున్నోడిపై చర్య తీసుకోవాల్సింది పోయి.. బాండ్ల రూపంలో విరాళాలు సేకరిస్తారా?.. నల్లడబ్బు మీ దగ్గరికి వస్తే తెల్లగా అవుతుందా అని ప్రశ్నించారు. ఉత్తర భారతంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని.. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రాముడి దయతోనే సుపరిపాలన అందిస్తామని మంత్రి పొన్నం తెలిపారు.