జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతం: మంత్రి పొన్నం

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతం: మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: మేనిఫెస్టోలో హామీనిచ్చిన విధంగా జనగామ జిల్లాకు తక్షణమే సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్ రూపొందించిన క్యాలెండర్ ను మంత్రి పొన్నం ఆయన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

గౌడలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. వైన్​షాపుల కేటాయింపుల్లో 25 శాతం గౌడ్స్ కు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ , వైస్ చైర్మన్ గడ్డమీద విజయ్ కుమార్ గౌడ్, పుంజాల హరిచరణ్ గౌడ్, పోతగాని ఐలన్ గౌడ్ పాల్గొన్నారు.

పలువురు నేతలతో పొన్నం వరుస భేటీలు

ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పలువురు నేతలతో వరుసగా భేటీ అయ్యారు. శనివారం పొన్నం తుక్కుగూడలోని మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లారు. ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనేక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత సోమాజిగూడలోని పొన్నం నివాసంలో ఆయనతో విక్రమ్ గౌడ్ భేటీ అయ్యారు. తన తండ్రి ముకేశ్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అయితే, రెండ్రోజుల క్రితమే విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు.

ఈ క్రమంలోనే పొన్నం ప్రభాకర్​తో విక్రమ్ గౌడ్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు పొన్నంతో సమావేశమయ్యారు. బీసీలకు ప్రాధాన్యం కల్పించేలా చొరవ తీసుకోవాలంటూ మంత్రిని కృష్ణయ్య కోరారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి కూడా మంత్రి పొన్నంను మార్యాదపూర్వకంగా కలిశారు.